Tuesday, November 19, 2024

జెలెన్‌స్కీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఫోన్

బీజింగ్ : ఉక్రెయిన్‌-రష్యా మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమేనంటూ చైనా కొంతకాలంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో నేడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఫోన్ చేసారు తాజా సంక్షోభానికి రాజకీయ పరిష్కార మార్గాన్ని కనుగునేందుకు చర్చలే అనువైన మార్గమని జిన్‌పింగ్‌ ఉక్రెయిన్‌కు సూచించారు. వొలొదిమిర్‌ జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. అణుయుద్ధంలో విజేతలెవ్వరూ ఉండరని హెచ్చరించినట్లు చైనా అధికారికంగా వెల్లడించింది.

అణుయుద్ధంలో విజేతలెవ్వరూ ఉండరు. ఈ విషయంలో ఇరు వర్గాలు ప్రశాంతంగా ఉంటూ.. నిగ్రహంతో సమస్యను పరిష్కరించుకోవాలి. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని.. తదనంతర పరిణామాలను పరిగణనలోకి తీసుకొని వ్యవహరించాలి. మానవత్వంతో ముందుకెళ్తూ సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం చర్చలు ఒక్కటే ఆచరణీయమైన మార్గం’ అని జిన్‌పింగ్‌ చెప్పినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ఈ సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కనుక్కునే విషయం గురించి మాట్లాడేందుకు చైనా తరఫున ప్రత్యేక ప్రతినిధిని ఉక్రెయిన్‌కు పంపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపింది. ఈ విషయంపై స్పందించిన ఉక్రెయిన్‌.. సుమారు గంటపాటు జిన్‌పింగ్‌తో జెలెన్‌స్కీ సంభాషించినట్లు తెలిపింది ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలైన తర్వాత జెలెన్‌స్కీకి జిన్‌పింగ్‌ ఫోన్‌ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement