జీ20 టూరిజమ్ వర్కింగ్ గ్రూప్ సదస్సుకు చైనా గైర్హాజరు కానుంది. ‘వివాదాస్పద భూభాగం’ లో అలాంటి సమావేశాలను నిర్వహించడాన్ని తాము ”గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు” చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు. వెన్‌బిన్ మీడియాతో మాట్లాడుతూ ”వివాదాస్పద భూభాగంలో జీ20కి సంబంధించి ఏ రకమైన సమావేశాలనైనా నిర్వహించడాన్ని చైనా నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తుంది. అలాంటి సమావేశాలకు మేం హాజరు కాము” అని తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌కు వేసవి రాజధాని శ్రీనగర్‌లో మే 22 నుంచి 24వ తేదీవరకు జరిగే మూడవ జీ20 టూరిజమ్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి భారత్ ఆతిథ్యమిస్తున్న చైనా వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చైనా వాదనకు భారత్ దీటైన సమాధానం ఇచ్చింది. తన సొంత భూభాగంపై సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ భారత్‌కు ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
చైనాతో సాధారణ సంబంధాలు నెలకొనడానికి ఇరు దేశాల సరిహద్దు వెంబడి శాంతి, ప్రశాంతత అత్యవసరమని చెప్పారు. జీ20 సమావేశాన్ని శ్రీనగర్‌లో నిర్వహించడమనేది తన వాస్తవిక సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో జమ్మూ కాశ్మీర్‌కు ఒక అతిపెద్ద అవకాశమని మంత్రి చెప్పారు. శ్రీనగర్‌లో అలాంటి ఒక అంతర్జాతీయ కార్యక్రమం జరగడం దేశానికి, ప్రపంచానికి ఒక సానుకూలమైన సందేశాన్ని పంపిస్తుందని అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహణ దిశగా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ సైతం వ్యతిరేకించింది. పొరుగుదేశం లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. తనకు అత్యంత సన్నిహితమైన పాకిస్థాన్ జీ20 సమావేశంపై అభ్యంతరాలు లేవనెత్తిన తర్వాత సదస్సుకు గైర్హాజరు కావాలని చైనా నిర్ణయించుకోవడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన జీ20 సదస్సుకు పాకిస్థాన్ హాజరుకాలేదు.