వాస్తవాధీన రేఖ వద్ద చైనా దూకుడు కొనసాగిస్తోంది. మౌలిక నిర్మాణాలను వేగవంతం చేస్తోంది. ఈ పరిణామాలు సరిహద్దు భద్రతపై భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవ తూర్పు లడఖ్‌లో పాంగాంగ్ సరస్సుపై వంతెన నిర్మాణం చేపట్టింది. ఈ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎల్‌ఏసీకి చేరువలో మూడు మొబైల్ టవర్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని చుషూల్ కౌన్సిలర్ కొంచెక్ స్టాంజిన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్‌చేశారు. భారత భూభాగానికి చాలా దగ్గరగా హాట్‌స్పింగ్‌కు సమీపంలో చైనా మొబైల్ టవర్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. ”చైనా దళాలు పాంగాంగ్ సరస్సుపై వంతెన నిర్మాణం పూర్తి చేశాయి. ఇప్పుడు హాట్‌స్ప్రింగ్స్ వద్ద మూడు మొబైల్ టవర్లను నిర్మించాయి. ఇవి భారత్ భూభాగానికి చాలా సమీపంలో ఉన్నాయి. ఇది ఆందోళనకరం కాదా..? ఇక్కడ మాకు కనీసం 4జీ సౌకర్యాలు కూడా లేవు. నా పరిధిలోని 11 గ్రామాలకు ఇప్పటికీ 4జీ సౌకర్యం లేదు” అని ట్విటర్‌లో పేర్కొన్నారు. అభివృద్ధి పరంగా చైనా చర్యను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోరుతూ సరిహద్దు గ్రామాల్లో భారత్ 4జీ సేవలు అందించాలని కోరారు. దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. టెలీ కమ్యూనికేషన్ సౌకర్యంలో మనం చాలా వెనుకబడివున్నాం. మాకు కేవలం ఒకే ఒక టవర్ అందుబాటులోఉంది. సరిహద్దుకు అవతలివైపు తొమ్మిది టవర్లున్నాయి అని కొంచెక్ స్టాంజిన్ తెలిపారు.
ఇదిలావుండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి మురళీధరన్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ లడఖ్ సమీపంలోని చైనా ఆక్రమణలను ఏ మాత్రం అంగీకరించమని వెల్లడించారు. పాంగాంగ్ వద్ద వంతెన నిర్మిస్తున్న ప్రాంతం 1962 నుంచి చైనా ఆక్రమణలో ఉందని వెల్లడించారు. 2020 మే నెలలో భారత్‌చ్ఖైనా మధ్య తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో ఘర్షణలు మొదలయ్యాయి. గల్వాన్ ఘటన తర్వాత భారత్‌చ్ఖైనాలు సైనిక కమాండర్ల స్థాయిలో 15 సార్లు చర్చలు జరిపాయి. కానీ, ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..