Monday, November 25, 2024

Exclusive: చైనా దురాగతం.. బోర్డర్​లో ఫైటర్​ జెట్​ల కోసం ఎయిర్​ బేస్​ నిర్మాణం

భారత్​–​ చైనా మధ్య ఉన్న లైన్​ ఆఫ్​ అక్చువల్​ కంట్రోల్​ (ఎల్​ఏసీ) భాగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు లడఖ్ సెక్టార్ వెంబడి పరిస్థితి మరింత దారుణంగా మారబోతోందని అమెరికన్ మిలిటరీ ఆఫీసర్​వెల్లడించారు. చైనా వైమానిక దళం భారత భూభాగానికి సమీపంలో ఉన్న ప్రధాన స్థావరం వద్ద యుద్ధ విమానాల మోహరింపును రెట్టింపు చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. బోర్డర్​లో ఫైటర్​ జెట్​లు దిగేందుకు వీలుగా చైనా ఎయిర్​బేస్​లను నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా అమెరికన్​ మిలటరీ ఆఫీసర్​ ఫ్లిన్​ రిలీజ్​ చేశాడు.

చైనా వైమానిక దళం హోటాన్‌లోని ప్రధాన స్థావరం నుండి పనిచేస్తోంది. వారు ఇప్పుడు అక్కడ దాదాపు 25 యుద్ధ విమానాలను మోహరించారు. ఇంతకు ముందు ఉంచిన దానికంటే ఇది చాలా ఎక్కువ అని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే.. చైనా చేపడుతున్న నిర్మాణాలు, యుద్ధ విమానాల మోహరింపును భారతీయ ఏజెన్సీలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, ఎటువంటి సంఘటననైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు.

కాగా, చైనా షాక్చేలో కొత్త యుద్ధ విమానాల స్థావరాన్ని కూడా డెవలప్​ చేస్తోంది. ఇది భారతదేశంతో LACతో పాటు చైనీస్ వైమానిక దళాన్ని మరొంత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. కాగా, భారత వైమానిక దళం తమ కంటే వేగంగా యాక్షన్​ చేపడుతుందని చైనీయులు గ్రహించారని.. అందుకే కొత్త ఎయిర్‌బేస్‌లని ప్రారంభించారని ఇండియన్​ ఆర్మీ ఆఫీసర్​ భావిస్తున్నారు. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (PLAAF) ఇటీవలి కాలంలో అనేక స్థావరాలను అప్‌గ్రేడ్ చేసింది. వీటిలో అనేక షెల్టర్ల నిర్మాణం, రన్‌వేలను  పొడిగించడం.. అదనపు బలగాలను మోహరించడం, రోడ్లను మరింతగా డెవలప్​ చేయడం వంటివి ఉన్నాయి.  అయితే.. భారతీయ పర్యవేక్షణలో ఉన్న సైనిక వైమానిక స్థావరాలలో తూర్పు లడఖ్ ఎదురుగా మూడు ఉన్నాయి. – కష్గర్, హోటాన్, న్గారి గున్సా. ఇతర స్థావరాలలో షిగాట్సే, లాసా గోంగ్కర్, న్యింగ్చి, చమ్డో పంగ్టా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

US అధికారి ఏమన్నారంటే..

యుఎస్ ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్ చార్లెస్ ఎ ఫ్లిన్ తన భారత పర్యటన సందర్భంగా పలు కీలక అంశాలను కనుగొన్నారు. లడఖ్‌ ఏరియాలో భారత్‌తో సరిహద్దు వెంబడి చైనా నిర్మిస్తున్న రక్షణ మౌలిక సదుపాయాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) కార్యకలాపాలను ముమ్మరం చేసిందని ఫ్లిన్ పేర్కొన్నాడు. ఇండో-యుఎస్ సంబంధాలు “చైనీయుల అవినీతి ప్రవర్తనకు ప్రతిఘటనగా” పని చేస్తున్నాయని అన్నారు.

- Advertisement -

కాగా, మే 5, 2020 నుండి తూర్పు లడఖ్‌లో భారతదేశం, చైనా మధ్య సరైన రిలేషన్స్​ లేవని, దళాలు మధ్య ప్రతిష్టంభన నెలకొందన్నారు. ఇరుపక్షాల మధ్య హింసాత్మక ఘటనలే దీనికి కారణంగా తెలుస్తోంది. దీని ఫలితంగా రెండు వైపులా ప్రాణనష్టం జరిగింది. ఇది పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో గతంలో చెలరేగింది. అయితే.. 15 రౌండ్ల సైనిక చర్చలు జరిగినప్పటికీ ఆ ప్రాంతంలో ఉద్రిక్తత తగ్గలేదు. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) యొక్క వెస్ట్రన్ థియేటర్ కమాండ్ ఇండియా-చైనా సరిహద్దును పర్యవేక్షిస్తోంది. ఫ్లిన్ ప్రస్తావిస్తున్న చైనా నిర్మాణం గత నెలలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో చైనా కొత్తగా వంతెన నిర్మించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తన సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించేలా.. దళాలను త్వరగా సమీకరించడానికి ఈ వంతెన ఎంతో సహాయపడుతుంది. రోడ్లు, రెసిడెన్షియల్ యూనిట్లు వంటి ఇతర చైనీస్ మౌలిక సదుపాయాలు కూడా భారతదేశం సరిహద్దు వెంబడి నిర్మించారు. వియత్నాం, జపాన్ వంటి ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని వివిధ దేశాలతో చైనా ప్రధాన సముద్ర సరిహద్దు వివాదాల్లో కూడా ఇట్లాగే వ్యవహరిస్తోందని ఫ్లిన్​ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement