Friday, November 22, 2024

కోవిడ్‌ పుట్టింది మార్కెట్‌లో.. మూడేళ్ళ తర్వాత బయటపెట్టిన చైనా

ఎట్టకేలకు కొవిడ్‌ వైరస్‌ మూలాలను చైనా వెల్లడించింది. చైనాలో ఒక పరిశోధన బృందం.. వైరస్‌ పుట్టుకతో ముడిపడి ఉన్న ఒక మార్కెట్‌ నుంచి మూడు సంవత్సరాల క్రితం సేకరించిన నమూనాలపై ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. కరోనా వైరస్‌ మూలాల వెదుకులాటలో ది హ్యూనన్‌ సముద్ర జీవులు, వన్యప్రాణుల మార్కెట్‌ ఒక కీలకమైన కేంద్రంగా నిలిచింది. 2020లో మార్కెట్‌ నుంచి సేకరించిన జీవ సంబంధిత ఆధారాలతో కూడుకున్న తొలి పత్రాన్ని చైనా పరిశోధక బృందం ప్రచురించింది. మార్కెట్‌లో విక్రయిస్తున్న జంతువులతో వైరస్‌కు ముడిపెట్టడం ద్వారా వైరస్‌ వ్యాప్తి ఎలా మొదలైందనే అంశంలో దర్యాప్తునకు కొత్త తలుపులను తాజా పరిశోధన తెరిచింది. కరోనా సోకిన వారి నుంచి సేకరించిన నమూనాల్లో క్రూర జంతువుల తాలూకు జన్యు పదార్థం ఉందని పరిశోధన వెల్లడించింది. .

వైరస్‌ మొదటగా ఒక బాధిత జంతువు నుంచి ఒక వ్యక్తికి సోకిందనడానికి ఇదే తొలి రుజువు అని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే పరిశోధన తాలూకు ఫలాలకు భాష్యం చెప్పడంలో అప్రమత్తంగా ఉండాలని మరికొందరు శాస్త్రవేత్తలు అన్నారు. నమూనాల్లో జన్యు పదార్థాన్ని బహిర్గతపరచడానికి మూడు సంవత్సరాలు ఎందుకు పట్టిందనే అంశం ఇప్పటికీ అస్పష్టంగా ఉందని వారు చెప్పారు. అయితే వూహాన్‌లో ఒక ప్రయోగశాల నుంచి వైరస్‌ ప్రమాదవశాత్తూ లీకైందనే మరో వాదన కూడా చర్చనీయాంశంగా మారింది. నేచుర్‌ జర్నల్‌లో ప్రచురితమైన తాజా పరిశోధన పత్రం మార్కెట్‌లో దుకాణాలు, ఉపరితల ప్రాంతాలు, బోనులు, యంత్రాల నుంచి సేకరించిన నమూనాల తాలూకు అత్యంత కీలకమైన వివరాలను కలిగి ఉంది.

మార్కెట్‌లో వన్యప్రాణులను విక్రయించిన ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాల్లో వైరస్‌ ఉన్నట్టు తేలిందని సదరు పత్రం వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో వైరస్‌కు సులభంగా లోబడే రక్కూన్‌ శునకాలు లాంటి జంతువులను మార్కెట్‌లో సజీవంగా విక్రయించారని తెలిపింది. అయితే ప్రస్తుతం తాము కనుగొన్న అంశాలు వైరస్‌ వ్యాప్తి ఎలా మొదలైందనే దానికి కచ్చితమైన రుజువు కాదని పరిశోధకులు తేల్చి చెప్పారు. మార్కెట్‌ నుంచి సేకరించిన నమూనాలు జంతువుల నుంచి వైరస్‌ సోకిందనే అంశాన్ని రుజువు చేయలేవని పరిశోధన పత్రం తెలిపింది. ఒక జంతువు నుంచి కాకుండా కొవిడ్‌ సోకిన ఒక వ్యక్తి ద్వారా మార్కెట్‌లోకి వైరస్‌ ప్రవేశించిందని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement