Wednesday, November 20, 2024

భారత్‌ పవర్‌ గ్రిడ్లపై చైనా ఎటాక్‌? సరిహద్దు ప్రాంతాల్లో బీజింగ్‌ కరెంట్‌ కుట్రలు

న్యూఢిల్లి : భారత సరిహద్దుల్లో కొత్తరకం కుట్రలకు చైనా పాల్పడుతోంది. గాల్వాన్‌ లోయలో ఘర్షణలు తలెత్తిన నాటినుంచి వివిధ రూపాల్లో భారత్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో విద్యుత్‌ పంపిణీ కేంద్రాలపై హ్యాకింగ్‌కు ప్రణాళిక అమలు చేసింది. హ్యాకర్ల సాయంతో సరిహద్దులో ఉన్న విద్యుత్‌ పంపిణీ కేంద్రాలపై దాడులకు తెగబడే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ బయటపెట్టింది. భారత్‌ పవర్‌ గ్రిడ్లపై చైనా హ్యాకర్లు సైబర్‌ దాడులు పాల్పడు తున్నారు. గత ఎనిమిది నెలలుగా లడఖ్‌ సమీపంలోని విద్యుత్‌ పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. చైనా హ్యాకర్లు ఇటీవల ఏడు భారతీయ లోడ్‌ డిస్పాచ్‌ కేంద్రాలను (ఎస్‌ఎల్డిసీ)ను లక్ష్యంగా చేసుకున్నట్లు తాము గుర్తించామని ఆ సంస్థ తెలిపింది.

ఉత్తర భారత్‌తోపాటు చైనాతో వివాదం ఉన్న లఢక్‌ సరిహద్దుకు సమీప ప్రాంతంలోని విద్యుత్‌ గ్రిడ్ల నెట్‌వర్క్‌ను చైనా హ్యాకర్లు ప్రధానంగా టార్గెట్‌ చేశారని పేర్కొంది. ఈ సారి భారత పవర్‌ గ్రిడ్‌లోకి చొరబడిన వారు.. కీలక సమాచారాన్ని అపహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ‘రెడ్‌ఎకో’ గ్రూప్‌ వీటిని హ్యాక్‌ చేసింది. తాజాగా డబ్బెడ్‌ టాగ్‌-32 అనే గ్రూపు పేరు బయటకొచ్చింది.

గతేడాది నుంచే..

గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో ఈ సైబర్‌ దాడులు జరిగాయని రికార్డ్‌ ఫ్యూచర్‌ గ్రూప్‌ తెలిపింది. 2021లో భారత్‌లో ఓ నౌకాశ్రయాన్ని చైనా ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే ‘రెడ్‌ ఎకో’ గ్రూప్‌ హ్యాక్‌ చేసింది. ఈ గ్రూప్‌ ఇంకా చురుగ్గా వ్యవహరిస్తోందని అమెరికాకు చెందిన రికార్డెడ్‌ ఫ్యూచర్‌ సంస్థే గుర్తించింది. ఈ వ్యవహారం ‘హ్యాండ్‌ షేక్‌’ మాదిరిగా ఉందని తెలిపింది. రెండు నౌకాశ్రయాలు సహా, పది సంస్థలపై హ్యాకర్లు గురిపెట్టినట్టు గతేడాది ఫిబ్రవరి పదో తేదీన గుర్తించామని చెప్పింది. ఫిబ్రవరి 28 నాటికి కూడా కొన్ని సంస్థల్లోకి సమాచారం వెళ్తుండడాన్ని గమనించామని వెల్లడించింది. 2021 మేలో ‘ఎయిర్‌ ఇండియా’పై సైబర్‌దాడిలో వీరి హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు 45లక్షల మంది ప్రయాణికుల వివరాలను వీరు తస్కరించినట్లు వెల్లడైంది. ఈ ఘటన వివరాలను సింగపూర్‌కు చెందిన ‘గ్రూప్‌-ఐబి’ బ#హర్గతం చేసింది.

హ్యాకింగ్‌.. గూఢచర్యం..

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన చైనా ప్రభుత్వ ప్రాయోజిత కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్‌ల నుంచి భారతీయ లోడ్‌ డెస్పాచ్‌ సెంటర్‌లలోకి వచ్చి వెళ్లే డేటాను తమ దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది. పవర్‌ గ్రిడ్‌లతోపాటు జాతీయ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ, అంతర్జాతీయ లాజిస్టిక్స్‌ కంపెనీకి చెందిన భారతీయ అనుబంధ సంస్థలో కూడా చైనా హ్యాకర్ల సైబర్‌ దాడులను గుర్తించినట్లు వివరించింది. సుదీర్ఘకాలంగా చైనా ప్రభుత్వ హ్యాకర్లు భారత్‌లోని పవర్‌గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని పరిమిత స్థాయిలో గూఢచర్యానికి పాల్పడు తున్నారు. కీలక మౌలిక సదుపాయాల చుట్టుపక్కల సమాచారాన్ని సేకరించి.. భవిష్యత్తు వ్యూహాలకు దీనిని వాడుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు హ్యాకర్లు ఇండియన్‌ నేషనల్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వ్యవస్థను, ఓ మల్టి నేషనల్‌ కంపెనీకి చెందిన అనుబంధ రవాణా సంస్థ కూడా హ్యాక్‌ చేశారు అని పేర్కొంది.

ఐపీ, డీవీఆర్‌ పరికరాలతో..

హ్యాకింగ్‌ కోసం ‘షాడోపాడ్‌’ అనే ఓ అనుమానాస్పద సాప్ట్‌nవేర్‌ను వాడినట్లు తెలిసింది. ఈ హ్యాకింగ్‌ గ్రూపు గతంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ, మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ సెక్యూరిటీతో కలిసి పనిచేసిందని రికార్డెడ్‌ ఫ్యూచర్‌ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ సీనియర్‌ మేనేజర్‌ జోనాథన్‌ కాండ్రా మాట్లాడుతూ..”కెమెరా, ఇతర ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాలతో కంప్యూటర్లలోకి చొరబడటం అసాధారణం. క్లోజ్‌-సర్క్యూట్‌ టెలివిజన్స్‌ (సీసీటీవీ) నెట్‌వర్క్‌లలో ఉపయోగించే ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ (ఐపీ) కెమెరాలు, ఇంటర్నెట్‌-ఆపరేటెడ్‌ డిజిటల్‌ వీడియో రికార్డింగ్‌ (డీవీఆర్‌) పరికరాల ద్వారా హ్యాకింగ్‌కు ప్రయత్నించారు. హ్యాకర్లు వాడిన పరికరాలు దక్షిణ కొరియా, తైవాన్‌లలో తయారు చేశారు” అని తెలిపారు. చైనా పీపుల్స్‌ ఆర్మీ మద్దతిచ్చే హ్యాకర్లు దీర్ఘకాల వ్యూ#హంలో భాగంగా గత 18 నెలల్లో భారత్‌ వంటి నిర్దేశిత దేశాల్లో సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారని రికార్డ్‌ ఫ్యూచర్‌ తెలిపింది. తమ దర్యాప్తులో తెలుసుకున్న ఈ సైబర్‌ దాడుల గురించి భారత ప్రభుత్వాన్ని అలెర్ట్‌ చేసినట్లు వెల్లడించింది.మరోవైపు లడఖ్‌ సమీపంలోని విద్యుత్‌ పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకునేందుకు చైనా హ్యాకర్లు చేసిన రెండు ప్రయత్నాలు ఫలించలేదని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ తెలిపారు. ఇలాంటి సైబర్‌ దాడులను ఎదుర్కోవడానికి ఇప్పటికే సంబంధిత రక్షణ వ్యవస్థను పటిష్టం చేసినట్లు ఆయన చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement