కరోనా వైరస్‌కు మూలమైన చైనా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. మరీ ఇంత తక్కువ వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వబోతున్న తొలి దేశంగా చైనా నిలిచింది. సినోవాక్ బయోటెక్‌కు చెందిన ఈ వ్యాక్సిన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ సంస్థ చైర్మన్ యిన్ వీడాండ్ అక్కడి అధికార మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఎప్పటి నుంచి పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇస్తామన్న దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
పిల్లల్లోనూ ఈ వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తున్నట్లు తొలి రెండు దశల ప్రాథమిక ఫలితాలు తేల్చాయి. వ్యాక్సిన్ వల్ల తీవ్ర ప్రభావాలు ఉత్పన్నమైన ఘటనలు చాలా తక్కువని న్యూస్ ఏజెన్సీ రాయ్‌టర్స్ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి అదనంగా బూస్టర్ డోసు ఇచ్చామని, దీని వల్ల వారంలో పదింతలు, 15 రోజుల్లో 20 రెట్లు యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు సినోవాక్ చైర్మన్ యిన్ వెల్లడించారు. మూడు డోసుల పద్ధతిని కంపెనీ కొనసాగించనున్నట్లు ఆయన చెప్పారు. యాంటీబాడీలు వృద్ధి చెందుతున్న తీరును పరిశీలించిన తర్వాత మూడో డోసును ఎప్పుడు ఇవ్వాలో అధికారికంగా సంస్థ సిఫారసు చేస్తుందని తెలిపారు. సినోవాక్ తర్వాత సినోఫార్మ్ కూడా పిల్లలకు అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది.