హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణకు సిరుల పంట పండిస్తున్న వనరుల్లో మద్యం విక్రయాలు కీలకంగా నిలుస్తున్నాయని వెల్లడైంది. దేశంలోనే మద్యం వినియోగంలో రాష్ట్రం అనూహ్యంగా వృద్దికి చేరుతున్నది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే చౌక ధరలు, సమయ పాలనలో పెరిగిన పనివేళలతో అర్ధరాత్రి 11 వరకు మద్యం అందుబాటులో ఉండటం, దొంగ మద్యం కట్టడి కారణంగా తెలంగాణ మద్యానికి డిమాండ్ పెరిగి విక్రయాల్లో పెరుగుదల నమోదవుతున్నది. తెలంగాణలో 59,13,600మంది అనునిత్యం మద్యం సేవిస్తున్నారని, వీరిలో 6లక్షలపైచిలుకు మంది బానిసలుగా మారారని వెల్లడైంది. ఇది గడచిన రెండేళ్ల క్రితం సామాజిక మంత్రిత్వ వాఖ లెక్కలు వెల్లడించిన వివరాలు. రాష్ట్రంలో 2016లో రూ. 14,075కోట్ల మద్యం విక్రయంకాగా, 2017లో రూ. 16595 కోట్లు, 2018లో రూ. 20,012కోట్లు, 2019లో రూ. 22,144కోట్లు, 2020లో 25,601కోట్లుగా 2021లో రూ. 3022కోట్లుగా అమ్ముడైంది. ఈ ఏడాది 2021 ఏప్రిల్ 1నుంచి నేటి వరకు రూ. 29,395 కోట్ల మద్యం విక్రయమైంది. ఇంకా ఈ ఏడాది ముగింపునకు 11 రోజుల గడువు ఉంది. రోజుకు రూ. 60నుంచి రూ. 100 కోట్ల విక్రయాల నేపథ్యంలో ఈ ఏడాది మొత్తం విక్రయాలు మరో రూ. 1100కోట్లు పెరగొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
2022లో 3కోట్ల 55లక్షల 73వేల 922 పెట్టెల మద్యం, 3కోట్ల 25లక్షల 37వేల 322 కేసుల బీర్లు విక్రయాలయ్యాయి. ఆదిలాబాద్ డిపోలో రూ. 571కోట్లు, హన్మకొండ-1లో రూ. 1381కోట్లు, హన్మకొండ -2లో రూ.1574కోట్లు, హైదరాబాద్-1లో రూ. 1402కోట్లు, హైదరాబాద్-2లో రూ. 2724 కోట్లు, కరీంనగర్ రూ. 1771కోట్లు, ఖమ్మంలో రూ. 2068కోట్లు, మహబూబ్‌గనర్‌లో రూ. 1484కోట్లు, మంచిర్యాల్‌లో రూ. 1361కోట్లు, మెదక్‌లో రూ. 1101కోట్లు, మేడ్చేల్ -1లో రూ. 177కోట్లు, మేడ్చేల్-2లో రూ. 2063కోట్లు, ల్గొండలో రూ. 2437కోట్లు, నిజామాబాద్‌లో రూ. 1618కోట్లు, రంగారెడ్డి-1లో రూ. 1902కోట్లు, రంగారెడ్డి-2లో రూ. 2095కోట్లు, సిద్దిపేటలో రూ.1337కోట్లు, వనపర్తిలో రూ. 1091కోట్లు, యాదాద్రిలో రూ. 1256కోట్లు, తాడ్వాయిలో రూ. 3.35కోట్ల మద్యం విక్రయమైంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలు మద్య పాన సేవనంలో దేశంలోనే ద్వితీయ స్థానాన్ని సాధించారు. మద్య సేవనంలో అండమాన్ తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేతో ఇరు తెలుగు రాష్ట్రాల పట్టణ ప్రజలు భారీగా మద్యం సేవిస్తున్నట్లుగా వెల్లడైంది. జాతీయ పోషకాహార పర్యవేక్షణా సంస్థ(ఎన్‌ఎన్‌ఎంబీ) ఈ విషయాన్ని ధృవీకరించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో 51.3 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తుండగా తర్వాతి స్థానంలో తెలుగు రాష్ట్రాలు నిల్చాయి. 37.4 శాతం పురుషులు మద్యంపై మోజు పెంచుకున్నవారేనని స్పష్టమైంది. గుజరాత్ 12.4 శాతంతో చిట్టచివరి స్థానంలో నిల్చింది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిసి సఘటున 36.2శాతం మంది పురుషులు ప్రతీరోజూ మద్యం సేవిస్తున్నారు. గ్రామీణులు, నగరాల్లో ప్రజలు సఘటున వారానికి 54వాతం మంది మద్యం తాగుతున్నారు. 15నుంచి 19ఏళ్ల మద్య వయసులో ప్రతీరోజు మద్యం తాగేవారిలో పురుషులతోపాటు మహిళలు కూడా ఉన్నారు. మద్యం విక్రయాలను టార్గెట్లు పెట్టి మరీ ప్రోత్సహిస్తున్న సర్కార్ తాజాగా ఆత్మరక్షణలో పడింది. బ్రీత్ ఎనలైజర్లు, అర్ధరాత్రి పహారాలతో మద్యం సేవించి వాహనాలను నడిపేవారిని అడ్డుకోలేమని తాజాగా గుర్తించింది. ఇందుకు ఇక భారత దేశంలో ఎక్కడా లేని రీతిలో అమెరికాను అనుసరించాలని యోచిస్తోంది. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్న సర్కార్ సూచనతో కొత్త పంథా అమలులోకి రానుంది. మందు ప్రియులకు అవగాహన కలిగించడం, మైనర్లకు మద్యం ఇవ్వకుండా నివారించడం అసాధ్యమని గుర్తించి సర్కార్ ఈ మేరకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందుకు అమెరికాలోని మందు బాబులు అనుసరిస్తున్న విధానాన్ని బహుళ ప్రచారం గావించి అందుబాటులోకి తేవాలని పోలీస్ శాఖ సూచన మేరకు ముందుకు వెళుతోంది.
సిగ్నటెడ్ డ్రైవర్ ఆఫ్ డే…
అమెరికాలో మద్యం ప్రియులు స్వతహాగా అనుసరించే పద్దతినే సిగ్నటెడ్ డ్రైవర్ ఆఫ్ డేగా అభివర్ణిస్తారు. దీని ప్రకారం పార్టీకి వెళ్లే స్నేహితుల్లో ఒకరిని ఆరోజు మద్యం సేవించకూడదని నిర్ణయిస్తారు. సదరు పార్టీ ముగిసిన తర్వాత మద్యం సేవించిన స్నేహితులను మద్యం సేవించని వ్యక్తి వాహనం నడుపుతూ అందరినీ ఇండ్ల వద్దకు క్షేమంగా చేరుస్తారు. ఇదే విధానాన్ని అమలు చేసి ఫలితాలు పొందేలా పోలీసులు, ఆబ్కారీ వర్గాలు ప్రయోగాత్మక ప్రచారం మొదలు పెట్టాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..