Tuesday, November 19, 2024

Big Story: సెంచరీ కొట్టిన మిర్చి.. రోజురోజుకు పెరుగుతున్న ధర..

మిర్చి ధర ఘాటెక్కింది.. రోజురోజుకు ధర పెరిగిపోతుండటంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వెనకాముందు అవుతున్నారు. మిర్చి లేకుండా కూరలు వండటం కష్టం.. దానికితోడు టిఫిన్లలో కూడా తప్పనిసరిగా మిర్చి వాడాల్సిందే.. ధర పెరిగిపోయినా వాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాకపోతే ధరను బట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.. ప్రస్తుతం కిలో వంద పలుకుతోంది. కొన్ని రోజులుగా మిర్చి ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మాత్రం మార్కెట్‌లో వంద పలుకుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కిలో కొనుగోలు చేసేవాళ్లు పావుకిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు.. వ్యాపారులు కిలో 80 రూపాయలకు కొనుగోలు చేసి ఏకంగా వంద రూపాయలకు కిలో చొప్పున విక్రయాలు చేస్తున్నారు.


ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి: ఎండలు ముదురుతున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగిపోయింది. ప్రస్తుతం మిర్చి ధర కూడా పెరిగిపోతోంది. ఎండలు ముదిరినట్లుగానే మిర్చి ధర కూడా పెరిగిపోతోంది. మిర్చి వినియోగం పెరిగిపోయింది. ఇందులో కారం ఎక్కువగా ఉండే మిర్చిని ఎక్కువమంది వినియోగిస్తున్నారు. కారం ఎక్కువగా ఉన్న వాటిని ఎక్కువగా వినియోగిస్తుండటం ధర రోజురోజుకు పెరిగిపోతోంది. గత కొన్ని మాసాలుగా చూస్తే మిర్చి ధర పెరుగుతూనే ఉంది. వర్షాకాలం సీజన్‌నుండి నేటి వరకు మిర్చి ధర ఎక్కువే. గత నాలుగు మాసాలుగా చూస్తే కిలో రూ. 60 పైమాటే. కాలనీల్లో తిరిగి అమ్మేవాళ్లు మాత్రం కిలోకు రూ. 80 చొప్పున విక్రయాలు చేస్తున్నారు. తాజాగా కిలో ఏకంగా సెంచరీ కొట్టింది. కారం ఎక్కువగా ఉండే మిర్చి ధరను చూసి వినియోగదారులు భయపడిపోతున్నారు. అమ్మో మిర్చి అనే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతికూరలో మిర్చి వాడుతుంటారు. దాంతోపాటు టిఫిన్లలో కూడా మిర్చి వినియోగం ఉంటుంది. ప్రస్తుత ధర చూసి వెనకాముందు చూసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

తగ్గిన దిగుబడి..

మిర్చి పంట సాగు చేస్తున్నా ఆశించినమేర దిగుబడి లేకపోవడంతోనే ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో సాగు చేసినా ఆశించినమేర మాత్రం దిగుబడి రాలేదు. జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, షాబాద్‌, ఫరూఖ్‌నగర్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి, మహేశ్వరం, కేశంపేట, చౌదరిగూడ మండలాల్లో సాగు చేస్తున్నారు. 2020-21 సంవత్సరానికి జిల్లాలో 2624 ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు. వివిధ కారణాలతో ఆశించినమేర దిగుబడి రాలేదు. దానికితోడు ఎండలు ముదురుతుండటంతో పంటకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో భారీ వర్షాలకు చాలావరకు పంట దెబ్బతింది. ప్రస్తుతం ఎండల ప్రభావం పంటపై పడుతోంది. నీటి వసతులు ఉన్న రైతులకు పెద్దగా ఇబ్బంది లేదు. అంతంత మాత్రంగా నీళ్లు ఉన్న రైతులు మాత్రం ఇబ్బందిపడుతున్నారు.

కొంటోంది రూ. 80….అమ్ముతోంది రూ. 100..

- Advertisement -

శంషాబాద్‌లో జరిగే సంతకు పెద్దఎత్తున కొనుగోలుదారులు వస్తారు…బస్సు సౌకర్యంతోపాటు రైల్‌ సౌకర్యం కూడా ఉండటంతో వ్యాపారులు వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తారు. వీళ్లు కాలనీల్లో దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తూ రెండు చేతుల సంపాధిస్తున్నారు. శంషాబాద్‌లో కిలో రూ. 80 చొప్పున కొనుగోలు చేసి రూ. 100 చొప్పున విక్రయాలు చేస్తున్నారు. కిలోకు ఏకంగా రూ. 20 గిట్టుబాటు చేసుకుంటున్నారు. కాలనీలు తిరిగి అమ్మే వాళ్లు కూడా కిలోకు వందకు ఏమాత్రం తగ్గడం లేదు. శంషాబాద్‌ మార్కెట్‌తోపాటు గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. కిలోకు రూ. 20 తగ్గకుండా లాభాలు గడిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేవాళ్లు మంచి లాభాలు గడిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులతోపాటు వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం లేకుండాపోతోంది. రైతుబజారుల్లో బోర్డు ధరలకు ఎవరూ కూడా విక్రయాలు చేయడం లేదు. బోర్డుపై ఉండే ధరకు పది రూపాయలు పెంచి విక్రయాలు చేస్తున్నారు. ఏమని వినియోగదారులు ప్రశ్నిస్తే ఇవి నాణ్యమైన కూరగాయలని తేల్చి చెబుతున్నారు. బోర్డుపై ఉన్న ధరకు కూరగాయలు కావాలంటే ఏది ఇస్తే అది తీసుకోవాలని చెబుతున్నారు. ప్రస్తుతం మిర్చి ధరలు మధ్య దళారులకు కాసులు కురిపిస్తోంది. గత మూడునాలుగు మాసాలుగా ధర ఏమాత్రం తగ్గడం లేదు. ఇది వ్యాపారులకు బాగా కలిసివస్తోంది. గత మూడునాలుగు మాసాలుగా కిలో రూ. 50కి తగ్గిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మిర్చి ధర సెంచరీ కొట్టింది. రానురాను ధర మరింతగా పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement