ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అప్పుడే పుట్టిన నలుగురు శిశువులు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది. కమలా నెహ్రూ పిల్లల ఆసుపత్రిలోని స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదం నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది.ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ… ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఇతరులతో కలిసి తాను వెంటనే ఆసుపత్రికి వెళ్లానని చెప్పారు. వార్డు లోపల మొత్తం పొగలతో నిండిపోయి ఉందని తెలిపారు. వార్డులో ఉన్న చిన్నారులను పక్కన ఉన్న మరో వార్డులోకి తరలించామని చెప్పారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన చిన్నారుల ప్రాణాలను కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు. ఆసుపత్రిలోని మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించిందని…. ఎనిమిది నుంచి పది ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయని ఫైర్ స్టేషన్ అధికారి తెలిపారు.