న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, డా. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథి ఐఏఎస్, నాగాలాండ్ హౌజ్ చీఫ్ రెసిడెంట్ కమిషనర్ జ్యోతి కలాష్, ఆంధ్రా విద్యా సంఘం అధ్యక్షులు డా. ఎమ్.ఆర్. మూర్తి, కార్యదర్శి ఎస్. ఈశ్వర్ ప్రసాద్, జ్యోతి ప్రజ్వలన చేశారు. పెండ్యాల సత్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రా స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు తమకు ఇష్టమైన రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని జ్యోతి కలాష్ ఆకాంక్షించారు.
పిల్లలకు ఒత్తిడి లేని విద్యా విధానాన్ని అందించాలని సూచించారు. తాను తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఈ స్థాయికి చేరుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఏఈఎస్ అధ్యక్ష, కార్యదర్శులు ఆయనను సత్కరించి బంగారు నందిని జ్ఞాపికగా బహుకరించారు. 100కు పైగా భోజ్‌పురి, 20కి పైగా హిందీ సినిమాలలో నటించిన జ్యోతి కలాష్ స్వయంగా పాట పాడి ఆహుతులను అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ గాయకుల గానామృతం అందరినీ ఉర్రూతలూగించింది. ఉగాది వేడుకల్లో ఏఈఎస్ యాజమాన్యంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తెలుగు, ఉత్తరాది వారు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.