Saturday, November 23, 2024

సెల్‌కు బాల్యం బందీ.. త‌లెత్తుతున్న మాన‌సిక స‌మ‌స్య‌లు!

(ప్రభన్యూస్‌) : ఇరవై ఏళ్ల క్రితం వరకు చిన్నారులకు అన్నం తినిపించాలంటే వారి తల్లులు చందమామను చూపెట్టో, పాటలు పాడో, కథలు చెబుతో తినిపించేవారు. కానీ నేటితరం పిల్లలు స్మా ర్ట్‌ఫోన్‌, టీవీలు లేనిది ముద్ద తినడం లేదు. మారుతున్న సాంకేతికత, పరిజ్ఞానం రోజురోజుకూ చిన్నారులను వారి తల్లిదండ్రులకు దూరం చేస్తోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు ఇతర బాధ్యతలతో తల్లిదండ్రులు బిజీగా ఉంటూ చిన్నారి పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్న సంస్కృతి నేటి సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతుంది. బాల్యం ప్రతీ ఒక్కరి జీవితంలో ఆనందమైన జ్ఞాపకం. కానీ నేటి తరంచిన్నారులు మాత్రం ఆ ఆనంద క్షణాలకు దూరమవుతూ వారికే తెలియని ఒంటరి జీవితాలను గడుపుతున్నారు.

చదువులతో బిజీ..

ఉదయం లేవగానే పాఠశాలకు వెళ్లడం సాయంత్రం ఇంటికి రాగానే ట్యూషన్‌లు ఇవి సాధారణంగా పెద్దపిల్లలకు ఉండే రోజు వారి దినచర్యలు. కానీ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్థులైతే ఆ చిన్నారులు సైతం ట్యూషన్‌లకు వెళ్లాల్సిందే. ఇలా పగలంతా చదువులతో కుస్తీ పడుతూ సాయంత్రం ట్యూషన్‌లు ఇంటికి రాగానే టీవో, సెల్‌ఫోన్‌లతో ఆటలు ఇలా చిన్నారుల జీవితాలు అనురాగాలు, అప్యాయతలకు దూరమవుతున్నాయి. ఆట పాటలు లేకుండా పుస్తకాలతోనే కుస్తీలు పడుతూ అనేకమంది చిన్నారులు ఒంటరిగా మానసిక క్షౌభను అనుభవిస్తున్నారు.

సాంకేతికతతో ఇబ్బందులు..

ఒకప్పుడు అనురాగాలు, అప్యాయతలతో గడిచిన బాల్యం నేడు మారుతున్న సాంకేతికతతో అన్నిరకాల అప్యాయతలను కోల్పోతోంది. టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, వీడియో గేమ్స్‌ ఇలా ఎన్నో ఆధునిక సాంకేతి కత పరికరాలు నేటి చిన్నారులకు కాలక్షేపంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వెళితే సాయంత్రానికి పిల్లల కోసం ఇంటికి వచ్చేవారు. నేడు ఎటు వెళ్లినా.. ఫోన్‌లలో వీడియో కాలింగ్‌ ద్వారా మాట్లాడి దూరంగా ఉంటున్నారు. ఇలా ఒకరకంగా మారుతున్న టెక్నాలజీ వల్ల కొంత ప్రయోజనాలు ఉన్నా దాని వల్ల అనర్థాలే ఎక్కువగా ఉంటున్నాయని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.

- Advertisement -

దూరం… దూరంగా..

పొద్దున బడికెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చితిని పడుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వచ్చే పరిస్థితులు ప్రస్తుతం అనేక కుటుంబాలలో కనిపిస్తున్నాయి. ఒకవేళ తొందరగా వచ్చిన ఫోన్‌లలో తల్లిదండ్రులు బిజీగా ఉంటుంటే పిల్లలు టీవీలో, ట్యాబ్‌లైట్‌లలో బిజీగా ఉంటున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలకు, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి. ఇలాంటి పోకడలు నేటి సభ్యసమాజం ఆలోచిస్తే తల్లిదండ్రుల ప్రేమకు దూరమై మానసిక క్షౌభను అనుభవిస్తున్న ఎంతో మంది చిన్నారులకు సైతం మేలు జరుగుతుంది.

అరచేతిలో ప్రపంచం…

సెల్‌ ఫోన్లో సోషల్‌ నెట్వర్కింగ్‌ అందుబాటులోకి వచ్చాక అరచేతిలో ప్రపంచం చూస్తున్నారు. నిండా పదేళ్లు కూడా నిండని చిన్నారులు సోషల్‌ నెట్వర్క్లతో బిజీ అవుత ఎన్నారు . ఫేస్బుక్‌, టెలిగ్రామ్‌, పింటర్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌, వీడియో కాలింగ్‌, ఆ్లనన్‌ షేర్‌, గూగుల్‌ ప్లస్‌ వంటి సామాజిక మాధ్యమాలు మేలు కంటే దుష్పరిణామాలే అధికంగా చూపిస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు పాఠశాల స్థాయి విద్యార్థులు ఇంటికి రాగానే టీవీలో కార్టూన్‌ కార్యక్రమాలకు అతుక్కుపోయేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ అరచేతిలో పెట్టుకొని ప్రపంచాన్ని చూస్తున్నారు.

పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ ఫీవర్‌

డాడీ ఒక్కసారి సెల్ఫోన్‌ ఇవ్వవా… అంకుల్‌ నీ ఫోన్లో గేమ్స్‌ ఉన్నాయా…? మమ్మీ గేమ్‌ ఆడాకే హోమ్వర్క్‌ చేస్తా. సెల్‌ ఇస్తే బయటకు వెళ్లను… ఇంట్లోనే ఉంటా… స్మార్ట్‌ ఫోన్ల వినియోగం బాగా పెరిగిన తర్వాత ప్రతిరోజూ పిల్లలు చెబుతున్న మాటలివి. గతంలో పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు ఆడుకోవడానికి వెళితే వారిని వెతికి తీసుకొచ్చే వాళ్లం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితులలో ఆడుకొమ్మని చెప్పినా వెళ్లని పరిస్థితి పిల్లలది. స్మార్ట్ఫోన్‌ ఉంటే చాలు పిల్లలు ఇంట్లోనే బంధీ అవుతున్నారు. గతంలో పట్టణాల్లోని పిల్లలు మాత్రమే స్మార్ట్‌ ఫోన్లతో ఆడుకొనే వారు ప్రస్తుతం మండలంలోని గ్రామాల్లోని పిల్లలు కూడా స్మార్ట్‌ ఫోన్లకు ఆకర్షితులై ఫోన్ల కోసం తల్లిదండ్రలతో పోట్లాడుతున్నారు.

పిల్లలపై కన్నేసి ఉంచాలి

పిల్లలు, యుక్తవయసుకు వచ్చిన పిల్లలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం మేరకే వారి మిత్రులతో మాట్లాడుతూ ఉండాలని, ప్రవరనలో మార్పులకు కారణాలు తెలుసుకొని పరిష్కరించాలని, అర్థరాత్రి వరకు చదువుతుంటే క్రమంగా ఈ అలవాటును మాన్పించాలని, చదువుకొనే సమయంలో తలుపులు మూయవద్దని చెప్పాలని, వారి మొబైల్‌, ల్యాఎ్టాప్‌ వంటివి వారిని నొప్పించకుండా చెక్‌ చేస్తూ ఉండాలి. చెడు వ్యసనాలకు బానిసలయితే వెంటనే కౌన్సెలింగ్‌ ఇప్పించాలని, ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఎన్నో దుష్పరిణామాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమితో మతిమరుపు, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి జరుగుతాయని తెలుపుతున్నారు. దీంతో ప్రతి విషయంలో చిరాకు, కోపం వస్తుందని వారు తెలిపారు. ఇవే కాకుండా అధికంగా మొబైల్‌ వాటకం మూలాన తలనొప్పి వంటి సమస్యలు అధికమవుతాయని వైద్యులు చెబుతున్నారు. సెల్‌ వాడే వారిని పెద్దలు గమనిస్తూ ఉండాలని మానసిక వైద్యుల సూచన.

Advertisement

తాజా వార్తలు

Advertisement