Friday, November 22, 2024

పెరుగుతున్న బాల్య వివాహాలు, గత నెలలో 18 కేసులు నమోదు

తమిళనాడు రాజధాని చెన్నైలో బాల్యవివాహాలు పెరుగుతున్నాయి. కాలనీలు, మురికివాడలలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలలో ఆస్తికోసం, మరికొన్ని కారణాల కోసం చిన్నారులైన ఆడబిడ్డలకు పెళ్ళిళ్లు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా 15 నెలలుగా పాఠశాలలు మూతపడటంతో చిన్నారులు వారి ఇళ్ళలోనే గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సంపాదన తగ్గిపోవడంతో భవిష్యత్‌లో తమ కుమార్తెలకు పెళ్ళి చేయలేమేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ కారణాల వల్లే నగరంలో బాల్య వివాహాలు ఎక్కువవుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

జూన్ నెలలో చెన్నై నగరంలో 18 బాల్య వివాహాలను అడ్డుకుని కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల స్థానిక తిరువిక నగర్‌లో 14 ఏళ్ల బాలిక వివాహానికి ఏర్పాట్లు జరుగుతుండగా పోలీసులు రంగంలోకి దిగి ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 23 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఇదే విధంగా కాశిమేడు ప్రాంతంలోని ఓ గుడిలో ఓ బాలిక వివాహాన్ని కూడా అడ్డుకున్నారు. ఆ కేసుకు సంబంధించి 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఇదే రీతిలో నగరం నలుమూలలా గుడిసె ప్రాంతాల్లో బాల్య వివాహాలను అడ్డుకున్నట్టు పోలీసు అధికారులు వివరించారు.

గత ఏడాది మార్చి నెలాఖరు నుంచి ఇప్పటివరకూ కరోనా లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటంతో మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలు కూలీ పనులకు వెళ్లలేక రోజువారీ సంపాదన లేకపోవడంతో పిల్లలను చదివించలేకున్నారు. దీనికి తోడు పాఠశాలలు మూతపడి చిన్నారులు ఇంటిపట్టునే గడుపుతున్నారు. మళ్ళీ పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో కూడా తెలియకపోవడంతో పెళ్ళిడుకు రాకపోయినా.. తమ కుమార్తెలకు వివాహం జరిపి తమ కుటుంబ భారాన్ని తగ్గించుకోవాలనే తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారు. ఈ కారణాల వల్లే నగరంలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయని, కొన్ని చోట్ల గుట్టు చప్పుడు కాకుండా ఈ పెళ్ళిళ్లు జరుగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయమై స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, సంఘసేవకులు తగు చర్యలు తీసుకోవాలని, బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం తెలియగానే 1098 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు సూచించారు.

ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement