అసోం ప్రభుత్వం బాల్యా వివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. బాల్యవివాహాల అణిచివేతలో భాగంగా శనివారం వరకు రాష్ట్రంలో 2,258 మంది అరెస్ట్ చేసింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ 2026 అస్సాం ఎన్నికల వరకు కొనసాగుతుందని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,074 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. బిస్వనాథ్లో ఇప్పటి వరకు కనీసం 139 మంది, బార్పేటలో 128 మంది, ధుబ్రిలో 127 మంది పట్టుబడ్డారని పోలీసులు ప్రకటించారు.
అసోంలో మైనర్లను వివాహం చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పినట్లుగానే ఆయన అటువంటి భర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు రోజులో 24 గంటల పాటూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు ఎనిమిది వేల మందిపై కేసులు నమోదుచేశారు. అలాగే, 2,258 మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్ మరో మూడేళ్లపాటు నిర్వహిస్తూనే ఉంటామని ప్రభుత్వం చెబుతోంది. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకుంటే పోక్సో కింద కేసులు పెడుతున్నారు. అలాగే, ఒకవేళ భర్త వయసు 14 ఏళ్లు ఉంటే అటువంటి బాలుడిని రీఫాం హోంకు తరలిస్తున్నారు. 2026లోగా బాల్య వివాహాలను అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, తమ భర్తల అరెస్టుపై భార్యలు ఆందోళన తెలుపుతున్నారు.