నందిపేట్, అక్టోబర్ 2(ప్రభ న్యూస్) : అభం శుభం తెలియని ఓ చిన్నారి విద్యుత్ షాక్ తో చనిపోయింది. ఎన్ మార్ట్ వద్ద ప్రిజ్ లో ఉన్న చాక్లెట్లు తీసుకోవడానికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన రితీష (4)కు షాక్ తగలడంతో పక్కనే ఉన్న పాప తండ్రి అది గమనించి లాగడంతో పాప సృహ తప్పిపడిపోయింది. వెంటనే ఆ చిన్నారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉందని నందిపేట వైద్యులు చెప్పడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లేలోగా పాప మరణించిందని బంధువులు తెలిపారు.
దీంతో చిన్నారి రితీష శవంతో ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ వద్దకు తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. బంధువులు చెప్పిన కథనం ప్రకారం.. నవి పేట గ్రామానికి చెందిన సంయుక్త, శేఖర్ తమ కుమార్తె రితీషను తీసుకొని నందిపేట గ్రామంలోని అత్తమ్మ ఇంటికి వచ్చారు. అయితే ఈరోజు ఇంటికి వెళ్దామని అనుకొని మండల కేంద్రంలోని ఎన్ మార్ట్ లో షాపింగ్ చేసుకొని వెళ్దామని షాపింగ్ కోసం ఉదయం ఆరున్నర ప్రాంతంలో సూపర్ మార్కెట్ కు కూతురిని తీసుకొని వచ్చారు. షాపింగ్ చేస్తున్న సమయంలో రితీష ప్రిజ్ లో ఉన్న చాక్లెట్లను తీసుకోవడానికి ప్రయత్నించడంతో షాక్ తగలడంతో అలాగే ఫ్రిజ్ కు అంటుకుపోవడంతో అది గమనించిన పాప తండ్రి లాగివేయడంతో పాప సృహ తప్పి పడిపోయింది. హుటాహుటిన నందిపేట ఆసుపత్రికి తరలించడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో నిజామాబాద్ తరలించారు. అక్కడికి చేరుకునే లోపు పాప మృతి చెందిందని అన్నారు. పాప శవాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులు, తల్లిదండ్రులు, యువకులు సూపర్ మార్కెట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు.
యజమానులు నిర్లక్ష్యమే కారణమా ?:
ఆదివారం రోజు కూడా సూపర్ మార్కెట్లో షాక్ తగిలిందని చెప్పినా పట్టించుకోలేదని వారి నిర్లక్ష్యంతో పాప ప్రాణం పోయిందని అని పలువురు అంటున్నారు. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని బంధువులు, తల్లిదండ్రులు అంటున్నారు. యజమానులు స్పందించక పోవడంతో అగ్రహంతో సూపర్ మార్కెట్ పై రాళ్లతో దాడిచేశారు. ఎస్ఐ రాహుల్ రాళ్లతో దాడి చేయవద్దని సముదాయించడంతో షాప్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు.