Tuesday, November 26, 2024

అందుకే ధావన్, చాహల్‌ను పక్కనపెట్టాం: చీఫ్ సెలక్టర్

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు టీమిండియాను ఎంపిక చేసిన త‌ర్వాత ప్ర‌ధానంగా ఇద్ద‌రిపైనే చ‌ర్చ జ‌రిగింది. శిఖ‌ర్ ధావ‌న్‌, య‌జువేంద్ర చాహల్‌ల‌కు జ‌ట్టులో స్థానం ద‌క్క‌క‌పోవ‌డంపై చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అయితే దీనిపై చీఫ్ సెల‌క్ట‌ర్ చేత‌న్ శ‌ర్మ వివ‌ర‌ణ ఇచ్చాడు. ధావ‌న్ ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో చాలా ముఖ్య‌మైన ఆటగాడు అని, అయితే ప్రస్తుతం ఇత‌ర ఆటగాళ్లకు అవ‌కాశం ఇవ్వ‌డానికే అత‌నికి విశ్రాంతి ఇచ్చిన‌ట్లు చేత‌న్ చెప్పాడు.

అయితే సెల‌క్ష‌న్ క‌మిటీ మీటింగ్‌లో ఏం చ‌ర్చించామ‌న్న‌ది తాను చెప్పలేనని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతానికి ధావన్‌కు రెస్ట్ ఇచ్చామని, త్వ‌ర‌లోనే అత‌డు మ‌ళ్లీ టీమ్‌లోకి వ‌స్తాడని చేత‌న్ శ‌ర్మ చెప్పాడు. టీమ్‌లో రోహిత్, రాహుల్‌, ఇషాన్ కిష‌న్ రూపంలో ముగ్గురు ఓపెన‌ర్లు ఉన్నార‌ని.. ఇక కోహ్లిని ఓపెనింగ్ ఆడించాల‌నుకుంటే టీమ్ మేనేజ్‌మెంట్ ఇష్ట‌మ‌ని చేత‌న్ స్ప‌ష్టం చేశాడు. ఇషాన్ కిష‌న్ మిడిలార్డ‌ర్‌లోనూ ఫిట్ అవుతాడ‌ని, అత‌డు త‌మ‌కు చాలా ఆప్ష‌న్స్ ఇస్తున్నాడ‌ని చెప్పాడు. ముగ్గురు వికెట్ కీప‌ర్ల‌ను ఎంపిక చేసిన‌ట్లుగా చూడ‌కూడ‌ద‌ని, రాహుల్ ఎమ‌ర్జెన్సీ అయితే మాత్ర‌మే ఆ బాధ్య‌త‌లు చేప‌డ‌తాడ‌ని తెలిపాడు.

మరోవైపు సీనియ‌ర్ బౌలర్ చాహ‌ల్‌ను కాద‌ని రాహుల్ చాహ‌ర్‌ను తీసుకోవడంపైనా చేత‌న్ శ‌ర్మ స్పందించాడు. యూఏఈ వికెట్ల‌పై కాస్త వేగంగా బౌలింగ్ చేసే రాహుల్ చాహ‌ర్ వికెట్లు తీయ‌గ‌ల‌డ‌ని తాము విశ్వ‌సించిన‌ట్లు చెప్పాడు. చాహ‌ల్ గురించి కూడా చ‌ర్చించినా.. చివ‌రికి రాహుల్ చాహ‌ర్‌వైపే మొగ్గు చూపిన‌ట్లు తెలిపాడు. న‌ట‌రాజ‌న్ రూపంలో ఓ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌల‌ర్ గురించి చ‌ర్చించామ‌ని, అయితే అత‌డు చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉండ‌టంతో చివ‌రికి తీసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లు చేత‌న్ చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement