Saturday, January 25, 2025

TG | గాలి మోటార్లలో తిరుగుతూ గాలి మాటలు : కేటీఆర్

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ గాలి మోటార్లలో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నారని
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా కౌన్సిలర్లను ఘనంగా సత్కరించారు.

అనంతరం మాట్లాడుతూ.. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్న హామీల అమలు మాత్రం మర్చిపోయారన్నారు. 1.67 కోట్ల ఆడబిడ్డలు మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయల కోసం ఎదురి చూస్తున్నారన్నారు.

తులం బంగారం కోసం ఎదురుచూస్తున్నారని, 4 వేల పింఛన్ ఎప్పుడు పడుతుందో అని ఎదురుచూస్తున్నారన్నారు. రైతుబంధు 15000 ఎప్పుడు పడుతుందని రైతులు కళ్ళల్లో వత్తులు పెట్టుకొని ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు.

సీఎం 100% రుణమాఫీ అయిందని దొంగ మాటలు చెబుతున్న ఆయన ప్రభుత్వంలోని మంత్రి మాత్రం రుణమాఫీ పూర్తిగా జరగలేదని చెప్పడమే రుణమాఫీ జరగలేదని చెప్పేందుకు నిదర్శనమన్నారు.

కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గాల్లో తిరుగుతూ ఇప్పటికీ గాలి మాటలే మాట్లాడుతున్నారన్నారు. ఏడాది పాలనలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని 1.40 లక్షల కోట్ల అప్పు మాత్రం చేశారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని, ప్రతిరోజు ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు వాటిని మార్చి సోషల్ మీడియాలో హామీల అమలు కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారి పై కేసులు నమోదు కోసం ఆరాటపడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నిరుద్యోగులనే కాదు అన్ని వర్గాలను మోసగించారన్నారు.

కేవలం అధికారం మాత్రమే కోల్పోయామని ప్రజాభిమానాన్ని మాత్రం కోల్పోలేదన్నారు. అయినా మంచే జరిగిందని ప్రజలకు కూడా కేసీఆర్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ మోసపూరిత పాలన ను బేరీజు వేసుకునే అవకాశం వచ్చిందన్నారు.

పదవీకాలం ముగిసినా కౌన్సిలర్లు అందరూ ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. 2014 ముందు సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతం ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు.

రాష్ట్రంలోని 142 మున్సిపల్ పట్టణాలను తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశామన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని గ్రామసభల్లో నిరసనలు, నిలదీతలే నిదర్శనమన్నారు.

ఎప్పుడు ఎన్నికలు వస్తాయో కెసిఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, వేములవాడ ఇన్చార్జ్ చెలమడ లక్ష్మీనరసింహారావుతోపాటు బారాస ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement