ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని బండి సంజయ్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇబ్బందులను గమనించారు. అన్నదాత సత్రాన్ని సందర్శించారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులందరికీ పవిత్రమైన, శక్తివంతమైన మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని మంగళ శాసనాలు పొందడం సంతోషంగా ఉందన్నారు. హిందూ బంధువులందరూ సుఖ:సంతోషాలతో నిండు నూరేళ్లు సంస్కారవంతమైన జీవితాన్ని కొనసాగించాలని భగవంతుడిని కోరుకున్నానన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం సమీక్ష కూడా నిర్వహించలేదన్నారు. శివరాత్రి పండుగ తరువాత ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ఎట్లా దారి మళ్లించాలనే దానిపై మాత్రం సమీక్షలు చేయడం కేసీఆర్ కు అలవాటైందని, ఇది మంచి పద్దతి కాదన్నారు. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించకపోవడం మూర్ఖత్వమన్నారు. గవర్నర్ సొంత ప్రసంగం ఉండదు.. కేబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని మాత్రమే అసెంబ్లీలో చదివి విన్పిస్తారన్నారు. బహుశా కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అభివృద్ది ఏమీ లేనట్లుంది.. అందుకే ఇట్ల చేస్తున్నరేమోనన్నారు. గవర్నర్ ప్రథమ పౌరురాలు. రాజ్యాంగ పరిరక్షకురాలైన మహిళ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏనాడూ వివాదాస్పదం కాలేదన్నారు. సీఎంను ఎన్నడూ గవర్నర్ అవమానించలేదన్నారు. ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేయలేదన్నారు. ఇదే సీఎం గతంలో గవర్నర్ ను పొగిడారని, మరి అట్లాంటప్పుడు ఎందుకు బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించలేదో కేసీఆర్ వివరణ ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్ కు మహిళలంటే చులకన భావన అని, మొదటి నుండి కించపర్చడం ఆయనకు అలవాటని, అందుకే మొదటి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటివ్వలేదన్నారు. గవర్నర్ వ్యవస్థనే సీఎం కేసీఆర్ కించపరుస్తున్నారన్నారు. మహిళా గవర్నర్ ను అవమానించడమంటే రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానించినట్లేనన్ని, ఇది మంచి పద్దతి కాదని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ బెంగాల్ తరహా రాజకీయాలు చేద్దామనుకుంటున్నడు.. బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital