Saturday, November 23, 2024

కొత్త సీజేఐగా ఎన్.వి.రమణ!

సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే.. 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రతిపాదించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బాబే ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో తదుపరి ప్రధాన న్యాయమూర్తి కోసం ప్రభుత్వం.. నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఎవరైతే బాగుంటుంది మీరే సూచించాలని జస్టిస్ బాట్టేను కేంద్ర ప్రభుత్వం కోరింది. దీంతో ఆయన అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఎస్ వి రమణను ప్రాతిపాదించారు. ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 2022 ఆగస్టు 26వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

నూతన ప్రధాన న్యాయమూర్తిని నియమించే విషయంలో పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదనలు స్వీకరించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరి పేరును ఆయన ప్రతిపాదిస్తే కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ప్రధాన మంత్రి కూడా అంగీకారం తెలియజేస్తే సదరు సీనియర్ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గా ఎంపిక అవుతారు. ఆయనను నియమించాలని కోరుతూ రాష్ట్రపతికి ప్రధాన మంత్రి సిఫార్సు చేస్తారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో జస్టిస్ బోబ్డే త‌ర్వాత ఎన్వీ ర‌మ‌ణ‌నే అత్యంత సీనియ‌ర్ న్యాయ‌మూర్తిగా ఉన్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియ‌ర్‌కే చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ప‌ద‌వి ద‌క్కాల్సి ఉంటుంది.

తెలుగువారైన జస్టిస్ ఎన్వీ రమణ.. 1957 ఆగ‌స్ట్ 27న కృష్ణా జిల్లా పొన్న‌వ‌రంలో ఓ వ్య‌వ‌సాయ కుటుంబంలో ఆయ‌న జ‌న్మించారు. 2017 ఫిబ్ర‌వ‌రి 14 నుంచి జస్టిస్ ర‌మ‌ణ సుప్రీంకోర్టు జ‌డ్జిగా ఉన్నారు. అంత‌కుముందు ఆరు నెల‌ల పాటు ఆయ‌న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ప‌ని చేశారు. 2000 జూన్ 27 నుంచి 2013 సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కు ఎన్వీ ర‌మ‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో జ‌డ్జిగా ప‌ని చేశారు.

కాగా, జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే 47వ సీజేఐగా 2019 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరో నెల రోజుల్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈలోగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement