Saturday, November 23, 2024

Delhi | రామయ్య చెంత చిందు యక్షగానం.. ప్రదర్శించిన తెలంగాణ కళాకారులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అయోధ్య శ్రీరామజన్మభూమి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా నగరం పండుగ శోభను సంతరించుకుంది. ఓవైపు నగరమంతా మహత్తర ఘట్టం కోసం ముస్తాబవుతుండగా.. మరోవైపు అడుగడుగునా దేశంలో వివిధ సాంస్కృతిక, జానపద కళారూపాల ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక కళారూపాల ప్రదర్శనలు అయోధ్యకు విచ్చేస్తున్న భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

భిన్న సంస్కృతి, సాంప్రదాయాలన్నీ ఒక్క చోట చేరినవిధంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సాంస్కృతిక, జానపత కళారూపాలు ఒక్కచోట కనిపిస్తున్నాయి. సరయూ నదీతీరంలో సాంస్కృతిక ప్రదర్శనలు, తులసీవనంలో జానపద కళారూపాల ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. 

తెలంగాణ నుంచి ‘చిందు యక్షగానం’

జానపద కళారూపాల్లో యక్షగానం ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక నాటకరూపం. అయితే దానికి కాస్త భిన్నంగా చిందులతో ప్రదర్శించే కళా, నాటకరూపం కాబట్టి చిందు యక్షగానంగా పేరొందింది. ఈ చిందు యక్షగానం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన నాటక, కళారూపం. ఇందులో నృత్యం, సంగీతం, అభినయంతో కూడిన నాటకం కలగలిపి.. వాటికి చిందులు జోడించి ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఉంటాయి.

- Advertisement -

ఎక్కువగా భాగవతంలోని అంశాలతో ప్రదర్శనలు ఉంటాయి కాబట్టి దీన్ని చిందు భాగవతం అని కూడా వ్యవహరిస్తారు. ఇది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచే ఉన్న కళ. అయితే ఆధునిక సమాజంలో సినిమా రంగం నాటుకుపోయిన తర్వాత అనేక కళలు అంతరించిపోతుండగా ఆ జాబితాలో ఈ చిందు యక్షగానం కూడా చేరింది. ఈ కళనే తమ కులవృత్తిగా మార్చుకుని జీవనం సాగిస్తున్న ఓ కులం జీవనోపాధిని కోల్పోయింది. అంతరించిపోతున్న స్థితిలో ఉన్న ఈ కళను పరిరక్షించేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన గడ్డం సమ్మయ్య విశేష కృషి చేశారు. దేశవ్యాప్తంగా 19 వేలకు పైగా ప్రదర్శనలు, లెక్కలేనన్ని రేడియో ప్రదర్శనలు ఇచ్చారు. 

ఆ బృందానికి అయోధ్య నుంచి ఆహ్వానం అందడంతో సోమవారం అయోధ్యకు చేరుకుని ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. గత రెండ్రోజులుగా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. సోమవారం సీతారామచంద్రుల అరణ్యవాసం ఇతివృత్తంగా యక్షగానాన్ని ప్రదర్శించగా.. మంగళవారం మహిరావణ గాథను ఇతివృత్తంగా చేసుకుని ప్రదర్శన చేశారు. భాష తెలియకపోయినా సరే.. సంగీతం, నృత్యం, అభినయం, నాటకంతో పాటు చిందులు కలగలిపిన ఈ వైవిధ్య కళారూపం అందరినీ ఆకట్టుకుంది. అయోధ్యకు వచ్చిన తెలుగు భక్తులు, యాత్రికులు కూడా ఈ ప్రదర్శనలు చూసి హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement