తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇటు తెలంగాణలోని హైదరాబాద్, అటు ఏపీలోని విజయవాడ మార్కెట్‌లలో ఆదివారం చికెన్ ధరలు చూసిన వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. కిలో చికెన్ రూ.రూ.250-280 వరకూ పలుకుతోంది. అసలే కరోనాతో కాసుల్లేక కష్టాలు పడుతున్న సామాన్యుల నెత్తిన ధరల భారం పెరుగుతూనే ఉంది. పప్పు, ఉప్పు, నూనెలు, పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యులు అల్లాడుతుండగా.. ప్రస్తుతం చికెన్ ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి.
ఓ వైపు బ్రాయిలర్ కోళ్ల కొరత.. మరోవైపు ఎండలకు కోళ్లు చనిపోవడం చికెన్ ధరలు పెరగడానికి కారణమని ఫౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాగే డిమాండ్ పెరగడం ప్రధాన కారణమని వారు అంటున్నారు. కాగా రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది కరోనా సమయంలో చికెన్ అమ్మకాలు చాలా తగ్గిపోయాయి. కరోనా విషయంలో చికెన్‌పై ఉన్న అనుమానాలు తొలగిపోవడంతో నాన్ వెజ్ ప్రియులు మళ్లీ చికెన్ తినడం ప్రారంభించారు.