ఒడిశాలో పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసరాల ధరలకు నిరసనగా.. ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. బిజు జనతా దళ్ (బీజేడీ) నేతలను లక్ష్యంగా చేసుకుని.. కోడి గుడ్లతో దాడికి దిగుతున్నారు. శుక్రవారం నల్ల జెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన నేతలు.. ఏకంగా మహిళా ఎంపీ అపరాజితా సారంగి ప్రయాణిస్తున్న వాహనంపై కోడిగుడ్లు విసిరారు. బుధవారం సీఎం నవీన్ పట్నాయ్‌పైనే.. బీజేపీ యువ మోర్చా నేతలు కోడిగుడ్లు విసిరిన విషయం తెలిసిందే.
పూరీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా సీఎం నవీన్ పట్నాయక్ పై ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఎంపీ అపరాజితా సారంగి.. ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో బనమాలిపూర్ వద్ద కాంగ్రెస్ నేతలు ఆమె వాహనంపై కోడి గుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు బాలాసోర్ రైల్వే స్టేషన్ కొత్త భవనం శంకుస్థాపనకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగితో పాటు బీజేడీ ఎమ్మెల్యే స్వరూప్ దాస్ హాజరయ్యారు.
మోడీ వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందని బీజేపీ నేతలు వాదించగా.. కాదు సీఎం నవీన్ పట్నాయక్ వల్లే ఇది సాధ్యమైందంటూ.. బీజేడీ నేతలు నినాదాలు చేశారు. ఆ తరువాత ఎంపీ కలగచేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. తాజాగా అపరాజితా సారంగి దాడి విషయమై.. ఎంపీ ప్రతినిధి ధనేశ్వర్ బారిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోడిగుడ్లతో పాటు రాళ్లు కూడా రువ్వారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.