Saturday, January 18, 2025

Chhattisgarh | కొనసాగుతోన్న నక్సల్స్ వేట… ఇప్పటికే 19మంది మావోయిస్టుల హతం

నెట్‌వ‌ర్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ స‌రిహ‌ద్దుకు 30కిలోమీట‌ర్ల దూరంలో 24 గంట‌ల‌పాటు జ‌రిగిన ఎదురుకాల్పుల్లో 19మంది మావోయిస్టులు మృతి చెందారు. మొద‌ట న‌లుగురు అని, త‌ర్వాత 12 మంది అని, ఆ త‌ర్వాత 17 మంది అని, శుక్ర‌వారం ఉద‌యం నాటికి 19మంది మృతి చెందిన‌ట్లు స‌మాచారం అందింది. అయితే భ‌ద్రతా అధికారులు 19మంది మృతిచెందార‌ని వెల్ల‌డించారు. ఈ ఏడాదిలో ఇది ఐదో ఎన్‌కౌంట‌ర్‌. ఈ ఎన్‌కౌంట‌ర్ల‌లో 35మంది వ‌ర‌కు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జవాన్లు కూడా గాయపడ్డారు.

ఛ‌త్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊనూరు పోలీసు స్టేష‌న్‌ పరిధి గుంజపర్తి, మారేడువాక, తంబాల బట్టి, బొమ్మేరు అటవీప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన డీఆర్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా స‌మావేశ‌మ‌వుతున్న మావోయిస్టులు కాల్పుల జ‌రిపారు. దీంతో భద్రతా బలగాలు సైతం ఎదురుకాల్పులకు దిగారు. గురువారం ఉద‌యం నుంచి శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు జ‌రిగిన కాల్పుల్లో 19మంది మృత్యువాత ప‌డ్డారు. ఇదే క్రమంలో కోబ్రారు చెందిన ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు సమాచారం. సంఘటనా ప్రదేశం నుంచి మావోయిస్టుల‌కు చెందిన భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నిత్యావసర సరుకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గాయ‌ప‌డిన జ‌వాన్ల‌ను బీజాపూర్ ఆస్ప‌త్రికి తరలించినట్లు వెల్లడించారు.

మావోయిస్టుల సమావేశాన్ని ముట్టడించిన భద్రతా బలగాలు..
దండకార‌ణ్యంలో పుజారి కాంకేర్, మారేడుబాక మధ్య మావోయిస్టులు రహస్య సమావేశం ఏర్పాటు చేసిన‌ట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింద‌ని తెలుస్తోంది. దీంతో కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్‌జీతో పాటు దంతెవాడ, సుక్మా, బీజాపూర్‌కు చెందిన 1500 మంది జ‌వాన్లు అడ‌వుల‌ను చుట్టుముట్టారు. ఈ నేప‌థ్యంలో ఎదురు కాల్పులు జ‌రిగాయి.

- Advertisement -

మృతుల్లో తెలంగాణ కీలక నేతలు ?
ఎన్‌కౌంట‌ర్‌లో 19మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో తెలంగాణకు చెందిన కీలక నేతలు కూడా ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ స‌రిహ‌ద్దుకు 30కిలోమీట‌ర్ల దూరంలో జ‌రిగిన స‌మావేశానికి తెలంగాణ‌కు చెందిన మావోయిస్టు కీల‌క నేత‌లు కూడా వెళ్లిన‌ట్లు తెలిసింది. అందులో కొంద‌రు పోలీసు తూటాల‌కు ప్రాణాలు విడిచార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతదేహాలు గుర్తిస్తే తప్ప పూర్తిగా పోలీసులు నిర్ధారించలేరు.

15రోజుల్లో ఐదో ఎన్‌కౌంట‌ర్‌…
ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకూ నాలుగు ఎన్‌కౌంట‌ర్లు జరిగాయి. 16మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ ఐదోది. ఈనెల 2వ తేదీన జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు, ఈనెల 4వ తేదీన జరిగిన ఎన్‌కౌంట‌ర్ లో ఐదుగురు, ఈనెల 6వ తేదీన జరిగిన ఎన్‌కౌంట‌ర్ లో ముగ్గురు, 8న‌ జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం జరిగిన ఎన్‌కౌంట‌ర్ లో 19మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే మావోయిస్టుల ఘాతుకానికి ఎనిమిది మంది భద్రతా దళాల జవాన్లు, ఒక డ్రైవర్ బలయ్యాడని తెలిసింది. ఈనెల 6వ తేదీన మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి పోలీసు వాహనం తునాతునకలై తొమ్మిది మంది మృతి చెందారు. దండకారణ్యంలో అబూజ్మద్ అడవుల్లో గత ఏడాది జరిగిన పలు ఎన్ కౌంటర్లలో 220మంది సభ్యులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ ఈ ఏడాది కూడా భారీ మూల్యం చెల్లించుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement