Friday, November 22, 2024

Chennai – ఇదెక్కడి వాతావరణం! వర్షాలంటారు… కానీ ఎండలేంటి

రెడ్​ అలర్ట్​ ప్రకటించిన ఐఎండీ
ఎటు చూసినా ఎండలే అంటున్న జనం
భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్​
చినుకు కూడా లేదంటున్న చెన్నై జనం
కొన్ని అంచనాలు తారుమారు కావొచ్చు
..అయినా గౌరవించాలంటున్న వెదర్​ ఎక్స్​పర్ట్స్​

ఆంధ్రప్రభ స్మార్ట్​, చెన్నై: చెన్నై నగరానికి వాతావరణశాఖ ఇచ్చిన వర్ష సూచనలు తారుమారయ్యాయి. 15వ తేదీన అతిభారీ వర్షాల వరకే ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ ఇచ్చినా.. అదే రోజు ఉదయం ఉన్నఫళంగా అత్యంత భారీ వర్షాలు సూచించే ‘రెడ్‌ అలర్ట్‌’గా మార్చారు. ఇక.. 16వ తేదీన అత్యంత భారీ వర్షాలొస్తాయని ‘రెడ్‌ అలర్ట్‌’ ఇచ్చినా కనీసం నగరంలో చాలా చోట్ల చిన్నపాటి చినుకులు కూడా కురవలేదు. ఈ తరహా వాతావరణ హెచ్చరికలతో నగరవాసులు గందరగోళానికి గురవుతున్నారు.

వెద‌ర్ రిపోర్ట్స్‌కి భిన్నంగా..

వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా చెన్నైకి ఉత్తరంవైపుగా గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత అది ఏపీ మీదుగా ప్రయాణించింది. తీరానికి దగ్గరగా వచ్చిన సమయంలో ఎలాంటి వర్షాలు కురవకుండా దాటేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు తీరం దాటగానే చెన్నైలో ఎండ కనిపించడం మరో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవన్నీ వాతావరణశాఖ అంచనాలకు భిన్నంగా జరిగాయి.

ఎక్కడా వర్షమే లేదు

- Advertisement -

వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి. గురువారం చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. చెన్నైతో పాటు కొన్ని జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు. బుధవారం సీన్‌ మారడంతో గురువారం కూడా నగరంలో అలాంటి పరిస్థితులే తారసపడ్డాయి. ఎక్కడా చుక్క వర్షం లేకుండానే రోజు గడవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణశాఖ అంచనాలకు భిన్నంగానే ఇవన్నీ జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. బుధవారం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో కేవలం కొన్నిచోట్ల మాత్రమే మోస్తరు వర్షాలు కురిశాయి. మణలి, తిరువొత్తియూర్‌లో 3 సెం.మీ, కత్తివాక్కం, తండియార్‌పేటలో 2 సెం.మీ, చెన్నై కలెక్టరేట్, రాయపురం, పెరంబూర్, అయనావరంలో సెం.మీ. మాత్రమే నమోదైంది. 16న మధ్యాహ్నం నుంచి ఎక్కడా వర్షమే లేదు.

అయినా ఐఎండీ సూచనలను గౌరవించాలి..

కొన్ని విమర్శలు వచ్చినా వాతావరణశాఖ హెచ్చరికల్ని గౌరవించాల్సిందేనని వాతావరణ నిపుణుడు ప్రదీప్‌ జాన్‌ తెలిపారు. కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు పడతాయనే సూచన వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయని పేర్కొన్నారు. 16న అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ ప్రకటనతో తాను ఏకీభవించలేదన్నట్లు తెలిపారు. మనుషులు తమకున్న సాంకేతికత పరిజ్ఞానంతో ఊహించి అంచనాలు మాత్రమే వేయగలరని, కొన్ని మోడల్స్‌ ఆధారంగా వాతావరణ సూచనలు ఉంటాయని అన్నారు. తాను కూడా తనకున్న సామర్థ్యం మేరకు మాత్రమే వాతావరణ సూచనలు చెబుతూ వస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆయన అంచనాల ప్రకారం 15, 16 తేదీల్లో 20 సెం.మీ. వర్షపాతం దాటిన ప్రాంతాలు 75 వరకు ఉన్నాయని, ఇవన్నీ కూడా 24గంటల్లో ఇంతటి వర్షపాతాన్ని నమోదు చేశాయని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement