ఐపీఎల్: ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ సేనకు ఓపెనర్లు డుప్లెసిస్ (50), రుతురాజ్ గైక్వాడ్ (33) రాణించారు. అయితే బెంగళూరు బౌలర్లు పుంజుకుని వరుస వికెట్లు తీయడంతో చెన్నై జట్టు కష్టాల్లో పడింది. రైనా (24), రాయుడు (14) మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచడంతో విఫలమయ్యారు.
అయితే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 28 బంతుల్లో 5 సిక్సులు, నాలుగు ఫోర్ల సహాయంతో 62 పరుగులు సాధించాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో నాలుగు వరుస సిక్సులు సంధించాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో CSK జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు సాధించగా.. చాహల్ ఓ వికెట్ పడగొట్టాడు.