చెన్నైకి చెందిన ఓ వ్యక్తి తన భార్య కోసం పోలీస్ కమిషనర్ అవతారం ఎత్తి జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే,, లారీ వ్యాపారంలో నష్టాలు రావడంతో కొంతకాలం విజయన్ అనే వ్యక్తి ఇంటిపట్టునే గడిపాడు. ఈ క్రమంలో భార్య ఏ పనిచేయడం లేదని నిలదీసింది. దీంతో గ్రూప్–1 పాసై పోలీస్ కమిషనర్‌గా పదోన్నతి పొందినట్లు అబద్ధం చెప్పాడు. స్నేహితురాలి సహకారంతో సైరన్‌తో కూడిన పోలీస్ జీప్‌ను కొనుగోలు చేశాడు. దాంతో పోలీస్ అధికారి అవతారమెత్తి పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు. కమిషనర్ గెటప్‌లో వెళ్తుండగా దిండుగల్లు జిల్లా లక్ష్మీపురం టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీల్లో విజయన్ బాగోతం బయటపడింది. దీంతో విజయన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వాహనం, నకిలీ ఐడీ కార్డు, యూనిఫాం, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో దిగిన ఫొటోలను పోలీసులు గుర్తించారు. మాజీ సీఎం చంద్రబాబుతో సన్నిహితంగా ముచ్చట్లాడుతున్న ఫొటో సైతం ఉండడం గమనార్హం. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేసేటపుడు వారితో ఫొటోలకు దిగినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు.
ఈ వార్త కూడా చదవండి: పాత నోట్లు, నాణేల విషయంలో జాగ్రత్త: ఆర్‌బీఐ