హైదరాబాద్, ఆంధ్రప్రభ: కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంటర్ విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సోమవారం జరగాల్సిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్-1కు బదులు కెమిస్ట్రి పేపర్ ఇవ్వడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ ఘటన కోదాడ సిటీ సెంట్రల్ కాలేజీలో జరిగింది. దీంతో పరీక్ష గంట ఆలస్యంగా నిర్వహించినట్లు తెలిసింది. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి ఇంటర్ విద్యార్థులు బలికావాల్సి వస్తోందని పలువురు ఆరోపించారు. విద్యార్థులందరికీ ప్రశ్నపత్రం ఇచ్చే క్రమంలో ప్రశ్నపత్రాలు ఉన్న బండెల్(కట్ట) తెరువగా అందులో కెమిస్ట్రీ, కామర్స్ ప్రశ్నపత్రాలు ఉన్నట్లు తెలిసింది. అయితే కెమిస్ట్రీ, కామర్స్ పరీక్ష ఈనెల 18న జరగనుంది. పరీక్షా కేంద్రానికి రావడమే తప్పుగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ పేపర్-1 ప్రశ్నపత్రాలకు బదులుగా కెమిస్ట్రీ, కామర్స్ ప్రశ్నపత్రాలను బండెల్‌లో పెట్టి సెంటర్‌కు పంపించడంలో తారుమారు అయినట్లు తెలుస్తోంది.
చాయిస్ తగ్గింపు…
ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలోని ప్రశ్న నెంబర్ 12లో ఏదేని నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. దీనికిగానూ గతేడాదిలో 6 ప్రశ్నలు ఇచ్చి అందులో నాలుగింటిని రాయమనేవారు. ఈసారి అలా ఇవ్వకుండా ఐదు ప్రశ్నలిచ్చి నాలిగింటిని రాయమన్నారు. గతంలో రెండు ఛాయిస్‌లను ఇచ్చిన అధికారులు..ప్రస్తుతం ఒక్క ఛాయిస్‌నే ఇవ్వడంపై విద్యార్థులు కాస్త ఇబ్బందులు పడినట్లు తెలిసింది. పైగా కొత్త సిలబస్ నుంచి ఈ ప్రశ్నలను అడిగారు. కరోనా కారణంగా ఛాయిస్‌ల సంఖ్యను పెంచామన్న ఇంటర్ బోర్డు క్వశ్చన్ నెంబర్ 12లో ఛాయిస్‌లు తగ్గించడం గమనార్హం. మొన్న నిన్న జరిగిన పరీక్ష పేపర్లలో అక్కడక్కడ ఒకటి రెండు తప్పులు దొర్లుతూ ప్రశ్నలు రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ అంశాలపై ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి ఖలీక్‌ను ఆంధ్రప్రభ ఫోన్‌లో సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..