అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుతపులి ముంబయి-ఆగ్రా జాతీయ రహదారిపై ప్రత్యక్షమైంది. జాతీయ రహదారిపై నిలిపిన ట్రక్కు కింద దూరింది. అంతే మధ్యప్రదేశ్లోని ఖార్గోన్ జిల్లా మీదుగా జాతీయ రహదారిపై వెళుతున్న ప్రయాణికులు చిరుతపులిని చూసి భయాందోళనలు చెందారు.
చిరుతపులి అరగంట పాటు ట్రక్కు కింద నుంచి కదలక పోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. చిరుతపులి ట్రక్కు కింద ఆశ్రయం పొందడాన్నివాహనాల డ్రైవర్లు చూసి అవాక్కయ్యారు. కొందరు డ్రైవర్లు వాహనం లోపల నుంచి చిరుతపులి నడిరోడ్డుపై ట్రక్కు కింద దర్జాగా కూర్చొని ఉండటాన్ని వీడియోలు తీశారు. రోడ్డుపై కూర్చున్న చిరుతపులి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు అరగంట తర్వాత చిరుతపులి సమీపంలోని పొలం వైపు వెళ్లింది. పరిస్థితిని గమనించిన అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుతపులి రాత్రి సమయంలో ట్రక్కు కిందకు వెళ్లి విశ్రాంతి తీసుకుందని, ఆ చిరుతకు గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. మొత్తం మీద చిరుతపులి రోడ్డుపై ప్రత్యక్షమవడంతో వాహనాల డ్రైవర్లు వణికిపోయారు. చిరుత పొలాల్లోకి పోయాక బతుకు జీవుడా అంటూ వాహనాల్లో గమ్యస్థానాల వైపు కదిలారు.