Tuesday, November 26, 2024

ఆలయాల రీ-గ్రూపింగ్‌కు చెక్‌! అధికారుల తీరుపై కమిషనర్‌ ఆగ్రహం..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఆలయాల రీ-గ్రూపింగ్‌కు దేవదాయశాఖ కమిషనర్‌ అడ్డుకట్ట వేశారు. కొందరు అధికారులు కమిషనర్‌ ప్రమేయం లేకుండానే ఆలయాల రీ-గ్రూపింగ్‌కు శ్రీకారం చుట్టడం వివాదాస్పదంగా మారింది. కేవలం దేవదాయశాఖ మంత్రితో చర్చించి మౌఖిక ఆదేశాల మేరకు ఆలయాల రీ-గ్రూపింగ్‌ ప్రక్రియను చేపట్టారు. పైగా రీ-గ్రూపింగ్‌ ఆలయాలకు కార్యనిర్వహణాధికారుల నియామకం కూడా వీరు చేపట్టడంపై కమిషనర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్‌ సీరియస్‌ అయ్యారు. విషయం దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌తో చర్చించిన కమిషనర్‌ చట్ట ప్రకారం రీ-గ్రూపింగ్‌ చెల్లదంటూ స్పష్టం చేశారు. ఆలయాల రీ-గ్రూపింగ్‌, ఒక సంస్థలో మరో సంస్థ విలీనం, అధికారుల బదిలీలు కమిషనర్‌ మినహా ఎవరూ చేయరాదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తీసుకోనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వివరించారు.

అసలేంటీ రీ-గ్రూపింగ్‌..

కొందరు అధికారులు ఆలయాల రీ-గ్రూపింగ్‌పై కొద్ది రోజుల కిందట ఉప ముఖ్యమంత్రి(దేవదాయశాఖ) కొట్టు సత్యనారాయణతో చర్చించారు. నియోజకవర్గాల వారీగా ఆలయాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రతిపాదించారు. వాటన్నింటిని ఆ నియోజకవర్గంలోని ప్రధాన(పెద్ద) ఆలయం పరిధిలోకి తీసుకురావడం, చిన్న ఆలయాల ఉద్యోగులు, అర్చకుల జీతాలు క్రమం తప్పకుండా చెల్లించేందుకు ప్రతిపాదించారు. ఆయా చిన్న ఆలయాల అర్చకులు, ఉద్యోగుల జీతాలను పెద్ద ఆలయం నుంచే చెల్లిస్తారు. ఆ తర్వాత చిన్న ఆలయాల నిధుల రాకనుబట్టి సంబంధిత పెద్ద ఆలయం ఖాతాలో జమ చేస్తారు. అధికారుల సూచనపై ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌తో చర్చించకుండానే మంత్రి అంగీకారం తెలిపారు. తొలి విడతగా రీ-గ్రూపింగ్‌ బాధ్యతలను కాకినాడ డీసీ విజయ రాజుకు అప్పగించారు. దానిపై చర్చించి మిగిలిన జోన్లలో సైతం అమలుకు చర్యలు తీసుకున్నారు. ఇంత పెద్ద తతంగం జరుగుతున్నా కనీసం కమిషనర్‌ దృష్టికి కూడా అధికారులు తీసుకెళ్ల లేదని తెలిసింది. పైగా రీ-గ్రూపింగ్‌ ఆలయాలకు కార్యనిర్వహణాధికారులు ఎవరుండాలనే దానిపై కూడా క్షేత్రస్థాయి అధికారులే నిర్ణయం తీసుకున్నారు.

చట్టంలోనే స్పష్టత..

ఆర్థిక వెసులుబాటు లేని చిన్న ఆలయాల్లో అర్చకులు, ఉద్యోగుల జీతభత్యాల చెల్లించేందుకు దేవదాయశాఖ చట్టంలో స్పష్టమైన వెసులుబాటు ఉంది. దేవదాయశాఖ చట్టం 1987కు సవరణలు చేసినప్పుడు అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి వీరికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకొని చట్టంలో పొందు పరిచారు. 33/07 చట్ట సవరణలో సెక్షన్‌65(ఎ) కింద వీరి జీతభత్యాల కోసం ప్రత్యేకంగా థార్మిక పరిషత్‌ ఏర్పాటు చేయాలని, సాధారణ నిధులను అందుకు జమ చేయాల్సి ఉంటుందని చట్ట సవరణలో పేర్కొన్నారు. ఆ నిధుల నుంచి అర్చకులు, ఉద్యోగులకు క్రమం తప్పకుండా జీత, భత్యాలు చెల్లించాలని అప్పట్లో చేసిన చట్ట సవరణకు శాసనసభ సెలెక్ట్‌ కమిటీ సైతం ఆమోదం తెలిపింది. ఆ తరహా చర్యలు తీసుకోకుండా చట్టపరమైన ఇబ్బందులు తలెత్తేలా రీ-గ్రూపింగ్‌ అంటూ కొత్త వివాదానికి తెరతీశారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు ప్రభుత్వం పాలక మండళ్లను నియమించింది. పెద్ద, చిన్న అనే తారతమ్యం లేకుండా వీలున్న ప్రతి చోటా పాలక మండళ్లు ఉన్నాయి. రీ-గ్రూపింగ్‌ విధానంలో పెద్ద ఆలయాల నుంచి ఇతర ఆలయాల అర్చకులు, ఉద్యోగుల జీతాల చెల్లింపులకు సంబంధిత పాలక మండలి అంగీకరించకుంటే పరిస్థితి ఏంటనే దానిసై స్పష్టత లేదు. ఒక వేళ చెల్లించేందుకు పెద్ద ఆలయం పాలక మండలి అంగీకరించినా, ఆ తర్వాత నిధులు వెనక్కి ఇచ్చేందుకు చిన్న ఆలయం పాలక మండలి అంగీకరించకుంటే చట్ట బద్ధత లేని నిర్ణయానికి ఎవరు బాధ్యత వహిస్తారనే సందేహాలు నెలకొన్నాయి.

- Advertisement -

మంత్రి తడబాటు..

దేవాదాయశాఖలో కీలక నిర్ణయాలు, మార్పులు చేయాలనుకున్నప్పుడు ఉన్నతస్థాయి సమీక్ష చేసి తీసుకోవాల్సి ఉండగా మంత్రి కొట్టు సత్యనారాయణ అవేవీ పట్టించుకోలేదని తెలుస్తోంది. కేవలం క్షేత్రస్థాయి అధికారులు చెప్పిన సూచనలకు వెంటనే ఆమోదం తెలపడం, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం వెనువెంటనే జరిగిపోయాయి. తీరా దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ చట్టపరమైన ఇబ్బందులను పేర్కొనడంతో ఆ వెంటనే ఆపేయాలంటూ ఆదేశించారు. తీరా మంత్రి చెపితేనే తాము చేశాం తప్ప సొంత ఆసక్తి లేదంటూ అధికారులు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కమిషనరే సుప్రీం..

కొందరు జోనల్‌ డీసీలు, ఏసీలు, జిల్లా ఎండోమెంట్‌ అధికారులు ఆలయాల రీ-గ్రూపింగ్‌, అధికారుల నియామకం చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అదనపు కమిషనర్‌ కే.రామచంద్ర మోహన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేస్తూ దేవదాయశాఖ చట్టంలోని సెక్షన్‌ 29 ప్రకారం నియామకాలు, పోస్టింగ్‌లు ఇచ్చే అధికారం కమిషనర్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం సైతం ఈ తరహా నియామకాలను తప్పుబట్టిందని పేర్కొంటూ ఆలయాల రీ-గ్రూపింగ్‌, ఈవోలకు అదనపు బాధ్యతలు సహా కమిషనర్‌ మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు విరుద్ధంగా వెళితే చర్యలు తప్పవని ఆ ఉత్తర్వుల్లో అదనపు కమిషనర్‌ హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement