ఇవాళ్టి నుంచి టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఇక నుంచి చీటికి మాటికీ వేధించే అన్‌వాంటెడ్ కాల్స్, మెస్సెజెస్ బెడద తప్పనుంది. ఫోన్ వినియోగం పెరిగిన కొద్దీ వివిధ రకాల ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్, ఫేక్ కాల్స్ బెడద తీవ్రమౌతోంది. ఈ సమస్య ఇకపై ఉండదు.. ఇలాంటివాటిని అరికట్టేందుకు గత కొద్దికాలంగా దృష్టి పెట్టిన ట్రాయ్.. కాల్ ఐడీని (పోన్ చేసేవారి పేర్లు, ఫోటోలు ఫోన్‌లో ప్రత్యక్షమౌతాయి) అందుబాటులోకి తెచ్చేలా టెలీకం కంపెనీలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఫోన్ వినియోగదారుల్ని ఫేక్ కాల్స్, ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్ ల బారి నుంచి రక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకోవల్సిందిగా టెలీకం కంపెనీలను కోరింది ట్రాయ్.
ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఇవ్వాల్టి నుంచి (మే 1) ఈ ఆప్షన్ వినియోగంలో రానుంది. ఇందులో భాగంగా వివిధ టెలీకం కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్టర్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. కాగా, ప్రైవసీ సమస్య కారణంగా ఎయిర్‌టెల్, జియో వంటి కంపెనీలు ఈ టెక్నాలజీ వినియోగానికి నిరాకరించాయి. అయితే, ట్రాయ్ ఆదేశాలుండటంతో కేవలం ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు, వినియోగదారుల్ని ఇబ్బంది కల్గించే కాల్స్‌ను అరికట్టేందుకు మాత్రమే ఏఐ ఫిల్టర్ వినియోగించేందుకు అంగీకరించాయి.