భారత ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ చేయడానికి గ్లోబల్ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. ఎన్నికల రాజకీయాల్లో వారి ప్రభావం, జోక్యానికి పుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె మాట్లాడుతూ, నాయకులు, రాజకీయ పార్టీలు, వారి ప్రాక్సీల ద్వారా రాజకీయ కథనాలను రూపొందించడానికి ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి గ్లోబల్ కంపెనీలు ఎక్కువగా ఉపయోగించ బడుతున్నాయని అన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ చేయడానికి సోషల్ మీడియా దుర్వినియోగం చేయబడే ప్రమాదం పెరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇది చాలా ముఖ్యమైన సమస్యని చెప్పారు. సోషల్ మీడియా కంపెనీలు అన్ని రాజకీయ పార్టీలకు క్రమబద్ధమైన స్థానం ఇవ్వడంలేదు. ఇతర రాజకీయ పార్టీలతో పోల్చితే, బీజేపీ ప్రకటనలకు ఫేస్‌బుక్ తక్కువ ధరలు ఆఫర్ చేసిందన్న అల్‌జజీరా, ది రిపోర్టర్స్ కలెక్టివ్‌లో ప్రచురితమైన నివేదికలను ఆమె ప్రస్తావించారు. భావోద్వేగంతో కూడిన తప్పుడు సమాచారం ద్వారా యువకులు, వృద్దుల మనస్సులు ద్వేషంతో నింపబడుతున్నాయి. ఫేస్ బుక్ వంటి ప్రాక్సీ ప్రకటన కంపెనీలు దానినుంచి లాభపడుతున్నాయి. ఫేస్‌బుక్ ద్వారా సామాజిక సామరస్యానికి భంగం కలిగించే కఠోరమైన విధానం మన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఎన్నికల రాజకీయాల్లో ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా దిగ్గజాల జోక్యం, ప్రభావానికి తక్షణమే స్వస్తిపలకాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది పక్షపాత రాజకీయాలకు అతీతం. మన ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
సోనియా ప్రసంగం తర్వాత బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే మాట్లాడుతూ, ఐటీ చట్టంలో సెక్షన్ 66ఎ ప్రవేశపెట్టడం ద్వారా వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. భారత వైమానిక దళ అధికారులను హతమార్చిన యాసిన్ మాలిక్, మన్మోహన్‌సింగ్‌తో కలిసి ఫొటోలో కనిపించినప్పుడు, దానిని అణచివేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? అని దూబే ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో భావ ప్రకటన స్వేచ్ఛను ఎలా అడ్డుకున్నారో పరిశీలించి, శ్వేతపత్రం సమర్పిందుకు కమిటీని ఏర్పాటు చేయాలని స్పీకర్ ఓం బిర్లాకు దూబే విజ్ఞప్తిచేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..