అమరావతి, ఆంధ్రప్రభ: ప్రైవేటు ల్యాబ్‌ల అడ్డగోలు దోపిడీకి కళ్ళెం వేసేందుకు ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ యాక్షన్‌ప్లాన్ రూపొందించింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు తనిఖీలకు వెళ్ళినప్పుడు నిబంధనలను పాటిస్తున్న ల్యాబ్‌లకు మాత్రమే అనుమతులు జారీచేయాలని, అనుమతులు లేని వాటిని గుర్తించి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ధరల పట్టిక, ల్యాబ్ టెక్నీషియన్ అర్హతలు, పెథాలజిస్టులను లేదా ఎమ్మెస్సీ చేసి, 5 సంవత్సరాల ల్యాబ్ అనుభవం కలిగిన నిపుణుల అర్హతలు పరిశీలించనున్నారు.
డెంగీకి సంబందించిన నిర్దారణ పరీక్షలు సెంటినరీ సర్వైలెన్స్ ఆసుపత్రులు (ఎఎస్‌హెచ్) ఆసుపత్రులలో మాత్రమే చేస్తారు. ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో డెంగీకి నిర్దారణ పరీక్షకు సంబంధించి, ఎలిసా పరీక్ష లేకపోయినట్లయితే, రాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ డెంగ్యు కేసును గవర్నమెంట్ ఆసుపత్రికి రెఫరల్ చేయాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లం’ఘనుల’పై వేటు వేయనున్నారు.
అడ్డగోలు దోపిడీ
వ్యాధికి సంబంధించి అవసరమైన పరీక్షలు మాత్రమే చేయాల్సి ఉండగా ధనర్జనే ధ్యేయంగా ప్రైవేటు ల్యాబ్‌లు, ప్రైవేటు ఆసుపత్రుల అనుబంధ ల్యాబ్‌లు అడ్డగోలుగా టెస్ట్‌ల పేరుతో అధిక ధరల్ని వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ధరల పట్టిక ప్రతి ల్యాబ్‌లో ఉండాల్సి ఉన్నప్పటికీ అత్యధిక శాతం నిర్వాహకులు దీన్ని పాటించడం లేదు. వాళ్ళు చెప్పిందే ధర అన్నట్లు అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నెం.13 – 2002 ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ లకు అనుభవం కలిగిన నిపుణులు ఉంటేనే ఆయా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తగిన షరతులతో అనుమతి ఇస్తారు. నిబంధనల్ని ఉల్లంఘించే ల్యాబ్‌ల లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకొనేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సిద్ధం అవుతున్నారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేయనున్నారు.
ఉల్లంఘనులపై వేటు తప్పదు
నిబంధనలు పాటించకుండా అధిక ధరలతో పరీక్షలు చేసిన ప్రైవేట్ ల్యాబ్ లు, అలాగే ప్రైవేటు ఆసుపత్రి అనుబంధ ల్యాబ్ లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ మరియు అన్ని రకాల జ్వరాలకు ఉచితంగా పరీక్షలు చేస్తున్నామన్నారు.
గ్రామస్థాయిలో డాక్టర్ వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌లలో మరియు ఆరోగ్య కార్యకర్తల వద్ద మలేరియా నిర్ధారణ కొరకు ఆర్డీటి కిట్స్ తగినన్ని అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులలో కూడా మలేరియా నిర్దారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నామన్నారు.. వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ లలో సుమారుగా రెండు లక్షల పైబడి డెంగ్యు ఆర్డీటి కిట్స్ అందుబాటులో ఉంచామన్నారు.
ప్రతి ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో కూడా తగినన్ని డెంగ్యు ఆర్డీటి కిట్స్ అందుబాటు-లో ఉంచామన్నారు. ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల నందు ఎలిసా ద్వారా డెంగ్యు నిర్దారణ పరీక్షలు నిర్వహిసున్నట్లు చెప్పారు. టైఫాయిడ్ పరీక్షలు కూడా ప్రతి ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో, ఏరియా , జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులలో అందుబాటు-లో ఉన్నాయని ప్రజలు ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హెల్త్ డైరెక్టర్ రామిరెడ్డి కోరారు.