Friday, November 1, 2024

రహదారులపై ప్రమాదాలకు చెక్‌.. నూతన మార్గదర్శకాల రూపకల్పనలో కేంద్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రం దృష్టి సారించింది. అందుకు కొత్త నిబంధనలు రూపొందించే పనిలో నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాల పరిధిలోని ప్రధాన రహదారులు, జాతీయ రహదారులకు లింకుగా ఉండే రోడ్ల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనుంది. ఈమేరకు రాష్ట్ర రోడ్లపై భద్రతా చర్యలకుగానూ కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. రోడ్ల ప్రమాదాల నివారణకు ఆర్‌అండ్‌బీ, పోలీసు, హెల్త్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఎడ్యుకేషన్‌ శాఖలు సమన్వయం చేసుకొని రోడ్ల నివారణకు చర్యలు తీసుకునే విధంగా మార్గదర్శకాలను రూపొందిస్తుంది. జాతీయ రహదారులపై ఒకే ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగనప్పుడు ఆ ప్రాంతాన్ని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) బ్లాక్‌ స్పాట్‌గా గుర్తిస్తుంది. ఆ ప్రాంతం వద్ద రోడ్డు డిజైనింగ్‌ పనులను మళ్లిd పరిశీలిస్తారు. ఏవైనా పొరపాట్లను గుర్తిస్తే అక్కడ చర్యలు చేపడతారు. అదేవిధంగా రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులకు లింకుగా ఉండే రోడ్ల వద్ద ప్రమాదాలు నివారణకు ఐదు శాఖల నుంచి ఒక్కో అధికారికి బాధ్యతలు అప్పగించనున్నారు.

ఏ ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయో గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రమాదాల నివారణలో పోలీసు, వైద్య, ఆర్‌అండ్‌బీ శాఖల సమాచారం కీలకం కానుంది. రాష్ట్ర రోడ్లపై జరిగే ప్రమాదాలకు బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించేందుకు పోలీసుల శాఖ ఇచ్చే సమాచారాన్ని అధికారులు కీలకంగా తీసుకోనున్నారు. ప్రమాదాల్లో మృతులు, గాయపడిన వారి తీరు వైద్యారోగ్య శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ఎంటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్యలు చేపడతారు. రహదారులపై వెళుతున్న వాహనాల సరళి, వాహన సామర్థ్యం, లోడుకి సంబంధించిన అంశాల గురించి రవాణా శాఖ నుంచి సమాచారం తెలుసుకొని ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతారు. విద్యార్థులకు పాఠ్యాంశంగా రోడ్డు భద్రత, నివారణను చేర్చడం, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి చర్యలు తీసుకుంటారు.

ఐదేళ్ల పాటు రోడ్డు భద్రతా చర్యలను కేంద్రం చేపట్టనుంది. ఇందుకు సుమారు రూ.7వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయనుంది. ఈ నిధుల్లో 50 శాతం నిధులను కేంద్ర రోడ్డు రవాణా శాఖ భరించనుండగా, మిగతా 50 శాతం నిధుల్లో చెరో 25 శాతం చొప్పున ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా పొందనుంది. ఈ నిధులను అత్యంత ప్రమాదాలు జరిగే రాష్ట్రాలుగా గుర్తించిన 12 రాష్ట్రాలకు మాత్రమే ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఈ 12 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన వాటాగా ఐదేళ్ల పాటు ప్రతి ఏడాది రూ.60 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. ఐదు శాఖలు సమన్వయంతో పనిచేసేలా ఎన్‌హెచ్‌ఏఐ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ విధంగా ఐదు శాఖలను బాధ్యులగా చేసి రాష్ట్ర, జాతీయ రహదారుల లింకు రోడ్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement