హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : సాంకేతిక అభివృద్ధిలో ఎల్లలు దాటుతున్న మనదేశ పరిజ్ఞానం ఎంతటి పటిష్టమైన వ్యవస్థను ఆవిష్కరిస్తున్నా.. అంతే స్థాయిలో అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. నిత్యం తీరికలేని జనజీవన విధానంలో నూటికి తొంభైశాతం మంది తామ కొనుగోళ్ళపై ఆన్‌లైన్ చెల్లింపులకే అలవాటు పడుతున్నారు. ఇళ్ళు, కార్యాలయాలు, విహార యాత్రలు, సరుకుల రవాణా, ప్రయాణాలు.. ఇలా ఒక్కటేమిటి? ఏ రంగంలో చూసినా యూపీఐ చెల్లింపులు తప్పనిసరి అవుతున్నాయి.
చిల్లరకొట్టు దుకాణాలు, టీ స్టాళ్ళు మొదలుకుని హోల్‌సేల్ వ్యాపారాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎగుమతుల వరకు ఆర్థిక వ్యవస్థ అంతా ఆన్‌లైన్ మయమైపోయింది. ముబైల్ ఫోన్ లేకుంటే జీవితమే లేదన్న స్థాయిలో డిజిటల్ పేమెంట్లకు ప్రాధాన్యత ఊహించనంతగా పెరిగిపోయింది. ఈ క్రమంలో చిన్న క్లూ దొరికితే చాలు.. కూపీలాగి ఏమాత్రం కబరు లేకుండానే కోట్లు కొల్లగొట్టే స్థాయికి ప్రతికూల సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందడంతో నేరాలు అదుపుతప్పుతున్నాయి.
ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని అదుపుచేయ్యలేని పరిస్థితులు వ్యవస్థకు సవాల్ విసురుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఆవిష్కరించి రాజధాని మహానగరం హైదరాబాద్‌లో మాత్రమే కాదు.. రాష్ట్రం మొత్తం ఏ మూలన చీమ చిటుక్కుమన్నా, ఇట్టే పసిగట్టి నేరస్తులను పట్టుకునే పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం సైబర్ నేరాలపైనా దృష్టి కేంద్రీకరించింది.
అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల అదుపునకు ప్రత్యేక వ్యవస్థను ఆవిష్కరించేందుకు పోలీసు శాఖ కసరత్తు చేస్తోంది. దేశంలో రోజు రోజుకూ క్రైం రేటు పెరుగుతుండడం.. ముఖ్యంగా సైబర్ క్రైం మ్‌ల సంఖ్య అదుపు తప్పుతుండడం.. మొన్నటివరకూ ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లి తదితర నగరాలకే పరిమితమయ్యే సైబర్ నేరగాళ్ళ ఆగడాలు తాజాగా హైదరాబాద్ నగరానికీ విస్తరించడం లాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు సాంకేతిక నిపుణులతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పోలీసులు, ప్రభుత్వాలు సైబర్ నేరాల నియంత్రణకు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్‌లైన్ మోసాలు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట జరుగుతున్న సందర్భాలు తాజాగా పెరిగినట్లు గుర్తించారు. సాధ్యమైనంత త్వరలో ఈ నేరాలకు చెక్ పెట్టేందుకు కొంతమంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించి సరికొత్త వ్యవస్థను ఆవిష్కరించేందుకు తెలంగాణ పోలీసులు చర్యలు మొదలుపెట్టారు.
సైబర్-సురక్షిత దేశానికి భరోసా కల్పించే దిశగా త్వరలోనే కొన్ని నిర్ణయాలను తీసుకోనున్నారు. డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను పటిష్టపరచడమే కాకుండా.. సైబర్ మోసాలను అరికట్టడమే లక్ష్యంగా అద్భుతమైన సైబర్ సెక్యూరిటీ ప్రోడక్ట్‌ను జనాలకు పరిచయం చేయబోతున్నారు. తక్షణ అవసరాన్ని గుర్తించి, సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లోని ప్రముఖ నిపుణుల ద్వారా ఆవిష్కరించే ‘హ్యాక్‌స్టాప్’ అనే ఒక కొత్త సాప్ట్nవేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.
హ్యాక్‌స్టాప్ అనేది కేవలం సైబర్ సెక్యూరిటీ- సాప్ట్ వేర్, ఫైర్ వాల్ మాత్రమే కాదు.. ఇది వ్యక్తులు, సంస్థలను సైబర్ దాడుల నుంచి సమర్థవంతంగా రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ల మిశ్రమంగా సాంకేతిక నైపుణ్యంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటు-లోకి రానుంది. ఇది కేవలం సైబర్ దాడులు, మోసాల నుండి ప్రజలను రక్షించడమే కాకుండా, ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి కూడా దోహదపడుతుంది.
అదేవిధంగా డిజిటల్ యుగంలో కావాల్సిన రక్షణను ఇవ్వడమే కాకుండా.. సైబర్-దాడుల పట్ల అప్రమత్తంగా ఉంచుతుంది. ఎలాంటి సైబర్ దాడిని అయినా ఎదుర్కొనే సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఈ సాఫ్ట్‌వేర్‌కు ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం ఉన్నతాధికారులు చెబుతున్నారు. సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను తీసుకురావడానికి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించారు.
సమాజం మొత్తాన్ని సైబర్ దాడుల నుండి కాపాడడమే తమ లక్ష్యంగా ఈ సైబర్ సెక్యూరిటీ హ్యాక్‌స్టాప్‌ను రాష్ట్ర పోలీసు శాక అతిత్వరలోతద ఆవిష్కరించనుంది. ‘సైబర్ సేఫ్ ఇండియా’ను ప్రోత్సహించే లక్ష్యంతో సైబర్ దాడులను, మోసాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కొంతమంది నిపుణులను నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇంటరాక్టివ్ సిమ్యులేషన్స్, అత్యాధునిక సాంకేతికత ద్వారా హ్యాక్‌స్టాప్ సాఫ్ట్‌వేర్ ఆధునిక సమాజాన్ని ముందుండి నడిపిస్తుంది. సైబర్ సంరక్షకులుగా మారి, దేశ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను పటిష్టం చేయడానికి దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ ముందడుగు వేస్తోంది.