Monday, November 18, 2024

Spl Story : ఛీటర్‌ శ్రీ చైతన్య.. నారాయణ నయవంచన..

ప్రభ న్యూస్‌, మాదాపూర్‌ : విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేయడంలోనూ, నమ్మిన వారిని నిలువునా ముంచడంలోనూ శ్రీచైతన్య, నారాయణలు ఆరితేరాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం రూపొందించే విద్యా సంవత్సర క్యాలెండర్‌తో సంబంధం లేకుండా తరగతులను నిర్వహించడం, సెలవు దినాల్లోనూ కళాశాలలను రన్‌ చేయడం సర్వసాధారణమని విద్యార్థులే వాపోతున్నారు. అయితే విద్యార్థుల భవితవ్యం కోసం ఇదంతా చేస్తున్నారంటే పొరపాటేనని, కేవలం ధనదాహంతోనే ఆయా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పలు ఘటనలు స్పష్ట ం చేస్తున్నాయి. అప్పో సప్పో చేసి లక్షల రూపాయలు కట్టి ఆయా కళాశాలల్లో చేర్పించినా, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడం సంగతి అటుంది, వారి బంగారు భవి తవ్యాన్ని తమ స్వహస్తాలతో చిదిమేసుకొనేలా అక్కడి పరిస్థి తులు ప్రభావితం చేస్తాయని ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు స్పష్ట ం చేస్తున్నాయి.
మొదలైన అడ్మిషన్ల వేట..
మాదాపూర్‌లోని నారాయణ, శ్రీచైతన్య కళాశాలల్లో అప్పుడే అడ్మిషన్ల వేట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ ర్యాంకులు సాధించాలంటే వెంటనే సీట్లు బుక్‌ చేసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందినకాడికి దండుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలస్యమైతే సీట్లు దొరకవంటూ తప్పుడు ప్రచారం సాగిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేసి భారీ మొత్తంలో డబ్బులు లాగుతున్నట్లు చర్చ జరుగుతోంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వివరాలను ఆయా స్కూళ్ల నుండి తీసుకొని, వారికి ఫోన్లు చేసి ముందుగానే బుక్‌ చేసుకోవాలని, ఆలస్యం అయితే సీట్లు అయిపోతాయంటూ మభ్యపెట్టి డబ్బులు లాగుతున్నారు. ముందస్తుగా బుక్‌ చేసుకుంటే చచ్చినట్లు తమ వద్దనే చేరుస్తారన్న అభిప్రాయంతో నారాయణ, శ్రీచైతన్య కళాశాలల యాజమాన్యాలు 10వ తరగతి విద్యార్థుల పేరెంట్స్‌కు ఎరవేస్తున్నట్లు తెలుస్తోంది.
పది పరీక్షలకు ముందే హౌస్‌ఫుల్‌ బోర్డులు..
పదవ తరగతి పరీక్షలు మొదలుకాకముందే తమ కళాశాలల్లో సీట్లు సగానికి పైగా అయిపోయాయంటూ ప్రచారం సాగిస్తూ, అమాయక తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తూ, కళాశాలల వైపు లాక్కుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కరిద్దరి మెరిట్‌ని చూపించి పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఈసారి ఐఐటీ, నీట్‌, ఎంసెట్‌ ఫలితాల్లో తెలంగాణ, ఏపీ తెలుగు రాష్ట్రాల్లో నారాయణ, శ్రీచైతన్యలదే నంబర్‌ వన్‌ అని తప్పుడు ప్రచారం సాగిస్తూన్నాయి ఆయా కళాశాలల యాజమాన్యాలు.
డిస్కౌంట్స్‌ పేరిట బురిడీ..
పదవ తరగతి ఫలితాలకంటే ముందుగానే బుక్‌ చేసుకుంటే డిస్కౌంట్‌ లభిస్తుందని ప్రచారం చేస్తూ, శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థ లు తల్లిదండ్రుల ఆశను ఆసరా చేసుకుంటూ దండుకుంటున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాసులే పరమావధిగా ముందుకు సాగుతున్న నారాయణ, శ్రీచైతన్య కళాశాలల యాజమాన్యాలు, ముందుగా బుక్‌ చేసుకుంటే సీటు కన్ఫామ్‌ అవుతుందని, డిస్కౌంట్‌ సైతం లభిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాలతో, పరీక్షలతో సంబంధం లేకుండా సాగుతున్న ఈ అక్రమ దందాతో, విద్యార్థుల తల్లిదండ్రులు నిలువునా మోసపోతున్నారు. మరి ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు కళ్లు తెరిచి, అక్రమాలపై ఉక్కుపాదం మోపాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement