Tuesday, November 26, 2024

Big story : కారుచౌకగా గ్రీన్‌ ఎనర్జీ, ముఖేష్‌ అంబానీ ప్రణాళిక.. టెలికం రంగంలో మాదిరిగానే సంచలనాలు?

టెలికం రంగంలో అతి తక్కువ టారిఫ్‌లతో సంచలనాలు సృష్టించిన ముఖేష్‌ అంబానీ ఇప్పుడు గ్రీన్‌ ఎనర్జీ రంగోలనూ అదే రీతిలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నట్లు రిలయన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. అతి తక్కువ ధరలకే, వినియోగదారులకు అందుబాటులో ఉండేలా టారిఫ్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తోంది. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన తరువాత ఎవరూ ఊహించిన రీతిలో తక్కువ టారిఫ్‌ ప్లాన్‌లతో మిగతా టెలికం సంస్థలు దిగిరావలసిన పరిస్థితి కల్పించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధినేత ఆ మార్కెట్‌లో అతిపెద్ద వాటాదారుగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు గ్రీన్‌ ఎనర్జీ రంగంలోకి అడుగుపెట్టిన ముఖేష్‌ అంబానీ రూ.6 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరేడేళ్లలో ఆ రంగంలో అగ్రపథాన నిలవాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

వచ్చే ఏడాది గ్రీన్‌ ఎనర్జీ రంగంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో భవిష్యత్‌ ప్రణాళికలపై రిల్‌ కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే పన్నెండు నెలల్లో గ్రీన్‌ ఎనర్జీ రంగంలో క్రమం తప్పకుండా భారీ పెట్టుబడులు పెడుతూ వెళ్లబోతున్నాం.. అలా రెండేళ్లు పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని రిల్‌ వార్షిక నివేదికలో సీఎండీ ముఖేష్‌ అంబానీ పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న మన ఇతర సంస్థలకన్నా గ్రీన్‌ ఎనర్జీ రంగం ఒక వెలుగువెలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సంప్రదాయ ముడు చమురు శుద్ధి, పెట్రో కెమికల్‌ వ్యాపారాల నుంచి క్రమంగా క్లీన్‌ ఎనర్జీ రంగంపై దృష్టి మళ్లించాలని ముఖేష్‌ అంబానీ భావిస్తున్నారు. గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం ఇప్పటికే చాలాచోట్ల గిగా ఫ్యాక్టరీలను నిర్మించడం ప్రారంభించింది.

సౌర విద్యుత్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తితో పాటు పంపిణీ, వినియోగ రంగాలపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం విద్యుత్‌ ధరలు అత్యధిక టారిఫ్‌లతో ఉన్నాయి. వాటికన్నా ఎంతో చౌకగా గ్రీన్‌ ఎనర్జీ అందించడమే రిల్‌ లక్ష్యం. వ్యాపార రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టడంలోను, ఇంధన రంగం నుంచి కమ్యూనికేషన్‌, వినియో గదారుల సేవారంగంలోకి అడుగుపెట్టి విజయాలు సాధించడంలోనూ ముఖేష్‌ అంబానీ తనదైన ముద్ర వేశారు. గత పదేళ్లలో ఆయన అనూహ్య విజయాలు సాధించిన విషయం తెలిసిందే.

2021-22లో రిలయన్స్‌ గ్రీన్‌ ఎనర్జీ ప్రయాణం మొదలుపెట్టింది.. భవిష్యత్‌లో అంతర్జాతీయంగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తిలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచి నాయకత్వం వహించే స్థితికి తీసుకువెళ్లబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. వినియోగదారులకు అందుబాటులో టారిఫ్‌ ఉండటమన్నది కీలకం. కొత్త సాంకేతికతతోనే ప్రజలకు అత్యంత ప్రయోజనకరమైన సేవలు చౌకగా అందించగలం. వైర్‌లెస్‌ బ్రాడ్‌బాండ్‌ రంగంలో మనం అనుసరించినట్టే కొత్త టెక్నాలజీ, చౌక టారిఫ్‌లతో గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనూ ముందుకువెళ్లబోతున్నామని ముఖేష్‌ అంబానీ పేర్కొన్నారు.

జియోతో మారిన సీన్‌
టెలికం రంగంలోకి అడుగుపెట్టిన తరువాత జియో వెంచర్‌తో ఆ రంగం రూపురేఖలే మారిపోయాయి. దేశంలో టెలికం సేవలు అందిస్తున్న సంస్థల్లో అగ్రస్థానానికి రిలయన్స్‌ జియో చేరిపోయింది. ఇతర ఆపరేటర్ల పరిథిలోని వినియోగదారులను తనవైపు భారీగా మళ్లించుకోగలిగింది. చౌకగా, నాణ్యమైన సేవలతో ఆకట్టుకుంది. తనదైన మొబైల్‌ ఫోన్లపై ఫ్రీ వాయిస్‌ కాల్‌, అత్యంత చౌకగా డేటా అందించేలా టారిఫ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది.

- Advertisement -

ఇదే విషయాన్ని ముఖేష్‌ అంబానీ స్పష్టం చేస్తున్నారు. జియో మాదిరిగానే గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనూ చౌకగా అందిస్తాం, విదేశాలకూ గ్రీన్‌ఎనర్జీని విక్రయిస్తాం.. తద్వారా ఆయా దేశాల్లోను కర్బన ఉద్గారాల కట్టడికి సహకరిస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంపన్నుల్లో ఒకడిగా చరిత్ర సృష్టించిన అంబానీకి రుణ సంకెళ్లు లేవు. పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టే ఆర్థిక శక్తి పుష్కలంగా ఉంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇప్పటికే ధీరూభాయ్‌ అంబానీ గ్రీన్‌ ఎ ర్జీ గిగా కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

భారీగా పెట్టుబుడుల.. ఒప్పందాలు
వచ్చే మూడేళ్లలో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడతామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.గ్రీన్‌ ఎనర్జీ రంగంలో తమకే ప్రత్యేకమైన టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, దేశవిదేశాల్లో ఉత్పత్తి, పంపిణీ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించడానికి అనేక సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంది. వారి నుంచి పెట్టబడులు రాబట్టింది. అలా ఒప్పందాలు చేసుకున్న సంస్థల్లో అమెరికాకు చెందిన ప్రఖ్యాత సంస్థ అంబ్రి, యూకేకు చెందిన ఫరాడియాన్‌ ఉన్నాయి. మరోవైపు నెదర్లాండ్‌లో ఎనర్జీ స్టోరేజ్‌ స్పేస్‌కోసం లిథియమ్‌ రెక్స్‌ నిర్మాణం ప్రారంభించింది.

సోలార్‌ పానెల్స్‌ నిర్మాణంలో అగ్రగామి సంస్థ అయిన జర్మనీకి చెందిన నెక్స్‌ వేఫ్‌లో రిలయన్స్‌ భారీ పెట్టుబడులు పెట్టింది. అలాగే సోలార్‌ ఎనర్జీ రంగంలో పేరుమోసిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీలో 40 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇక హైడ్రోజన్‌ ఎకోసిస్టమ్‌ రంగంలో అమెరికాకు చెందిన చార్ట్‌ ఇండస్ట్రీస్‌తో చేతులుకలిపింది. అలాగే డెన్మార్క్‌కు చెందిన స్టీస్‌దల్‌ ఏ/ఎస్‌ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రోలైసర్‌ టెక్నాలజీలో తరువాతి తరం సాంకేతికతను అందించడం ఈ ఒప్పందంలో భాగం. శుద్ధ జలాలనుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంలో ఖర్చు భారీగా తగ్గేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement