Thursday, November 21, 2024

Delhi: పేదలకు చౌకగా అత్యాధునిక వైద్యం.. ఏపీలో ఆరోగ్య వ్యవస్థ పటిష్టం : మంత్రి రజని

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సామాజిక ఆరోగ్య పథకాల ద్వారా ప్రజలందరికీ వైద్య సంరక్షణ సదుపాయాలను కల్పిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన డిజిటల్ హెల్త్ సదస్సులో రాష్ట్రాన్ని వరించిన రెండు గ్లోబల్ అవార్డులను ఆమె అందుకున్నారు. మహిళల కోసం డిజిటల్ హెల్త్ నేపథ్యంతో రూపొందించిన లోగోను రజని ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంపై ఆమె ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్ సహా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో ప్రసిద్ధి గాంచిన నిపుణులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. సదస్సులో మంత్రి విడదల రజని మాట్లాడుతూ పేదలకు కూడా అత్యాధునిక వైద్యం అందాలన్నదే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.

డిజిటల్ హెల్త్‌లో ఏపీ 2 గ్లోబల్ అవార్డులను కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రుల్లో సమగ్ర వైద్య సదుపాయాలను కల్పిస్తూ ఐపీహెచ్ఎస్ (ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్) ప్రమాణాలను అనుసరిస్తూ ప్రభుత్వ దవాఖానాలను కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులల్లా మార్చిన ప్రక్రియను ఆమె వివరించారు. వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషిని మెచ్చి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ హెల్త్ విషయంలో ఇప్పటికే 6 అవార్డులను అందించిన విషయాన్ని ఆమె ఆ సందర్భంగా ప్రస్తావించారు. పీపీపీ పద్ధతిలో ఏపీలో ఆర్ట్ మెడికల్ టీచింగ్ యూనివర్శిటీ, రీసెర్చ్ వర్సిటీ ఏర్పాటు, సమగ్ర సదుపాయాలతో కాన్సర్ కేర్ సెంటర్ స్థాపన, డిజిటల్ వైద్య సేవలందించడంలో కలిసి పని చేయడానికి ముందుకు రావాలని ఔత్సాహికులను మంత్రి రజని ఆహ్వానించారు.

రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో 16 చోట్ల ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి గల అవకాశాలను ఆరోగ్య సదస్సులో వివరించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో ‘ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్’ను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ సామాజిక ఆరోగ్య సంరక్షణ పథకాల ద్వారా పౌరులందరికీ సమానమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా హాజరైన వీక్షకుల ముందు ఏపీలో డిజిటల్ పరిణామం ఎలా మలుపు తీసుకుందో తెలిసేలా శ్రీమతి నమ్మి లక్ష్మి అనే మహిళ టెలిపాథాలజీ కథను ఉదాహరణగా మంత్రి రజిని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement