రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ 41 ఏండ్ల వ్యక్తిని కొట్టి చంపారు మావోయిస్టులు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడనే అనుమానంతో అతన్ని చంపేశారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు.
మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన వ్యక్తిని భద్రు సోడిగా పోలీసులు గుర్తించారు. బైరాంఘర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కేశముండి గ్రామ వాసి భద్రు అని తెలిపారు. ఇక భద్రు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
భద్రును చంపిన ప్రదేశంలో మావోయిస్టులు ఒక లేఖను వదిలి వెళ్లిపోయారు. సోడి యాంటీ మావోయిస్టు సివిల్ మిలిషీయా సల్వా జుడుం మూవ్‌మెంట్‌లో యాక్టివ్‌గా పాల్గొన్నారని ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంలో కీలకంగా ఉన్నారని, అందుకే హత్య చేసినట్లు తెలిపారు. మావోయిస్టుల కోసం పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.