Friday, November 22, 2024

Chattisgarh 25 మంది నక్సలైట్లు లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌ జిల్లాలో 25 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఐదుగురి తలలపై మొత్తంగా రూ.28లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మావోయిస్టు)కు చెందిన వీరంతా గంగ్లూర్‌, భైరామ్‌గఢ్‌ ఏరియా కమిటీల్లో క్రియాశీలకంగా పనిచేసేవారని, వీరిలో ఇద్దరు మహిళలు సైతం ఉన్నట్లు బిజాపుర్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు. శంబటి మద్కం (23), జ్యోతి పునెం (27) మహేశ్‌ తేలంపై ఒక్కొక్కరి తలపై రూ.8లక్షల చొప్పున రివార్డు ఉందన్నారు.

శంబటి అనే మహిళ 2012 నుంచి ఉద్యమంలో చురుగ్గా ఉండేవారని, 2020లో సుక్మా జిల్లాలో, 2021లో బిజాపుర్‌లో భద్రతా సిబ్బందిపై జరిగిన భారీ దాడుల ఘటనల్లో ఆమె పాత్ర ఉందని తెలిపారు.

- Advertisement -

విష్ణు కర్తమ్‌ అలియాస్‌ మోను, జైదేవ్‌ పొడియంలపైనా రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. మావోయిస్టు భావజాలం పట్ల నిరాశ, ఉద్యమ నేతల దౌర్జన్యాలను ఎత్తిచూపుతూ వారు లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు.

తమ ఎదుట లొంగిపోయిన వారికి రూ.25వేలు చొప్పున సాయంతో పాటు ప్రభుత్వ పాలసీ ప్రకారం పునరావాసాన్ని కల్పిస్తామని ఎస్పీ వెల్లడించారు. బిజాపూర్‌ జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 170మంది సరెండర్‌ కాగా.. 346 మంది నక్సలైట్లు అరెస్టయినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement