హైదరాబాద్, ఆంధ్రప్రభ: అంతరాష్ట్ర అవరోధాలను అధిగమించి సమ్మక్క సాగర్ నిర్మాణం పనుల్లో వేగం పెరిగింది. ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నప్పటికీ సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్ గడ్ అభ్యంతరాలతో, సీడబ్ల్యూసీ ఆక్షేపణతో కొద్దికాలంగా పనులకు అంతరాయం కలిగింది. అయితే అపరభగీరథుడు సీఎం కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ చేసి ముంపు తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని చత్తీస్ గడ్ స్వాగతించి ఎన్ ఓ సీ ఇచ్చేందుకు అంగీకరించింది. ఇటీవల చత్తీస్ గడ్ ఇంజనీరింగ్ నిపుణులబృందం, తెలంగాణ నిపుణుల బృందం సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సమ్మక్క బ్యారేజ్ నిర్మాణపనులు పరిశీలించి ప్రాజెక్టు ఎత్తు 2 మీటర్లు తగ్గించేందుకు తెలంగాణ తీసుకున్న నిర్ణయంతో ఛత్తీస్ గడ్ భూముల ముంపు ఉండదనే అభిప్రాయానికి వచ్చారు.
ఈ మేరకు గోదావరి నది యాజమాన్యం సంస్థకు, కేంద్ర జలశక్తి, సీడబ్ల్యూసీ కి ఎన్‌ఓ సీలు ఇవ్వనున్నట్లు చత్తీస్ గడ్ ప్రకటింటడంతో సమ్మక్కసాగర్ పనులు ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్లితే రాష్ట్ర తొలుత ప్రభుత్వం ములుగుజిల్లా కాంతనపల్లి దగ్గర సమ్మక్క జలాశయ నిర్మాణం చేపపట్టగా స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 29మార్చి 2015న కాంతనపల్లి బ్యారేజి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి ముంపు తగ్గించే మార్గాలను అన్వేషించేందుకు రీఇంజనీరింగ్ డిజైన్ కు వ్యాప్ కోస్ సంస్థకు బాధ్యతలు అప్పగించగా కాంతనపల్లి గ్రామానికి 17 కి.మీ. ఎగువన ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన ప్రాంతంగా గుర్తించింది.
ఈ నేపథ్యంలో కాంతనపల్లి నుంచి తుపాకుల గూడెందగ్గరకు ప్రాజెక్టును బదిలీ చేసి నిర్మాణపనులను నీటిపారుదల శాఖ చేపట్టింది. 85 మీటర్ల పూర్తి నీటి నిల్వసామర్ధ్యంతో 22.50 టీఎంసీల నిల్వకు ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఈ జలాశయం మొదటి దశలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సాగునీరు అందించేందుకు పనులు చేపట్టడంతోపాటుగా రెండవదశలో శ్రీరాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణతో 7.5 లక్షల ఎకరాలకు సాగునీరుఇందించేందుకు ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే రెండవదశలో కాకతీయ కాలువలోకి నీటిని ఎత్తిపోసేందుకు ఈ ప్రాజెక్టును రూపకల్పనచేశారు. రూ. 2వేల 121 కోట్ల తోప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వేయి 616కోట్ల 43 లక్షల విలువైన పనులు జరిగాయి.
అయితే 85 మాటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో సరిహద్దుల్లోని ఛత్తీస్ గడ్ భూములు ముంపుకు గురవుతాయనే ఆందోళన ఆరాష్ట్రం వ్యక్తం చేస్తూ సీడబ్ల్యూసీ కి అభ్యంతరాలు తెలిపింది. అయితే ఛత్తీస్ గడ్ ఇంజనీరింగ్ నిపుణులు, తెలంగాణ ఇంజనీర్ల బృందం సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో చేసిన సర్వేలో ముంపుపై సుధీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రాజెక్టు 85 మీటర్ల ఎత్తునుంచి 2మీటర్లు తగ్గిస్తే ముంపు తగ్గుతుందనీ, కేవలం 50 ఎకరాల భూమిలోకి బ్యాక్ వాటర్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో 2మీటర్ల ఎత్తు తగ్గించేందుకు తెలంగాణ నీటి పారుదల శాఖ నిపుణులు అంగీకరించడంతో సమస్య పరిష్కారం అయిందని ఇరురాష్ట్రాలు భావిస్తూ ఎన్‌ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్ గడ్ అంగీకరించింది.
50 ఎకరాల భూముల్లో పట్టాభూములు లేకపోవడంతో సమస్య పరిష్కారం సులువవుతుందని ఇంజనీరింగ్ నిపుణులు భావిస్తున్నారు. ఛత్తీస్ గడ్ అంగీకించడంతో ప్రాజెక్టు నిర్మాణ అనుమతులకోసం జిఆర్‌ఎంబీ, కేంద్రజలశక్తి, సిడబ్ల్యూసీ అనుతులకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు సమగ్రనివేదిక సమర్పించనుంది. అయితే అంతరాష్ట్ర సమస్యలు పరిష్కారం కావడంతో త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పనుల్లో వేగం పెంచింది.