ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో క్లీన్ ఇండస్ట్రియల్ పార్కులకు ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా) ప్రతిష్టాత్మక అవార్డులను అందజేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన టీజీఐఐసీ ఆధ్వర్యంలో చర్లపల్లి ఇండస్ట్రియల్ పార్క్ “ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ఛాంపియన్” విభాగంలో ఫిక్కి అవార్డును సొంతం చేసుకుంది.
ఢిల్లీలో జరిగిన ఫిక్కీ అవార్డుల కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ ఘోయల్ చేతుల మీదుగా టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ కుమార్ అవార్డును అందుకున్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు టీజీఐఐసీ పనితీరును, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు వచ్చే పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. పర్యావరణ అనుకూల పరిశ్రమల స్థాపనకు, మౌలిక వసతుల కల్పనకు సంస్థ అవలంబిస్తున్న ఆధునిక పద్ధతులు పెట్టుబడిదారులపైనే కాకుండా ప్రజలపైనా సానుకూల ప్రభావం చూపుతాయని అన్నారు.