Tuesday, November 26, 2024

Big story : యూపీఐ చెల్లింపులపై చార్జీలు.. కస్టమర్ల అభిప్రాయ కోరుతున్న ఆర్బీఐ

ప్రస్తుతం చాలా మంది చేతిలో డబ్బులు లేకుండానే షాపుల్లో సరుకులు కొనుగోలు చేస్తున్నారు. షాపింగ్‌ చేసి తమకు కావాల్సినవాటిని తీసుకుంటున్నారు. ఇందుకు కస్టమర్‌ బ్యాంక్‌ ఖాతాలో నగదు, చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా, ఫోన్‌ నెంబర్‌ ద్వారా నగదు చెల్లించే వెసులుబాటు ఉంది.

ప్రస్తుతం యూపీఐ చెల్లింపులకు ప్రజలు బాగా అలవాటుపడ్డారు. సురక్షితంగా, సులభంగా చెల్లింపులు జరపడంతో క్రమంగా లావాదేవీలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం యూపీఐ ద్వారా జరుగుతున్న చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేసే విషయాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది. దీనిపై ప్రజాభిప్రాయం కోరుతూ ఆర్బీఐ చర్చా పత్రాలను విడుదల చేసింది. చెల్లింపుల వ్యవస్థ ల్లో ఛార్జీలు పేరుతో ఈ చర్చా పత్రాన్ని ఆర్బీఐ విడుదల చేసింది. దీనిపై అక్టోబర్‌ 3లోగా అభిప్రాయాలు చెప్పాలని ఆర్బీఐ ప్రజలను కోరింది.

క్రెడిట్‌ కార్డు తరహాలో…

క్రెడిట్‌ కార్డు ద్వారా జరిగే లావాదేవీల విషయంలో మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌)ను వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంక్‌లు, కార్డు జారీ సంస్థలు పంచుకుంటున్నాయి. ఇదే తరహాలో యూపీఐ చెల్లింపులపైనా ఎండీఆర్‌ ఛార్జీలు విధిస్తే, సంబంధిత సంస్థలు మరింత సమర్ధంగా సేవలు అందిస్తాయని ఆర్బీఐ అభిప్రాయపడుతోంది. ఎండీఆర్‌ తరహాలోనే లావాదేవీ మొత్తంపై కొంత శాతాన్ని రుసుముగా వసూలు చేయాలా, లావాదేవీలకు స్థిరంగా కొంత మొత్తం వసూలు చేయాలా అన్న విషయాన్ని ఈ చర్చా పత్రంలో ప్రస్తావించారు.

ఇమ్మిడియట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌), నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌(నెఫ్ట్‌), రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌)తో పాటు డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) తదితరాలకు ఛార్జీల ప్రతిపాదన చేసింది. వీటి విధివిధానాలు, నిబంధనలు, ఇతర అంశాలపై సూచనలు ఇవ్వాలని ఆర్బీఐ కోరింది. డిజిటల్‌ చెల్లింపుల సేవలు అందించేందుకు కంపెనీలు కొంత ఖర్చు చేస్తున్నాయి. దీన్ని వ్యాపారులు లేదా వినియోగాదారులు భరించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గతంలోనూ పేర్కొంది. ఇందుకు విధించే ఛార్జీల వల్ల డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థకు అవరోధం రాకుండా చూడాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ దృష్టితోనే దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి చర్చా పత్రాన్ని విడుదల చేసింది.
రోజుకు 21 కోట్ల లావాదేవీలు

- Advertisement -

యూపీఐ ఆధారిత చెల్లింపులు ప్రస్తుతం రోజుకు 21 కోట్లకు పైగా జరుగుతున్నాయి. ఎన్‌పీసీఐ జులైలో విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 338 బ్యాంక్‌లు యూపీఐ లావాదేవీల్లో పాలుపంచుకుంటున్నాయి. 628.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 10,62,991.76 కోట్లు. 2021 జులైలో లావాదేవీల సంఖ్య 324 కోట్లు ఉంటే , విలువ 6,06,281.14 కోట్లు మాత్రమే. సంవత్సరం వ్యవధిలోనే లావాదేవీల సంఖ్య రెట్టింపు అయ్యింది. విలువ కూడా దాదాపు రెట్టింపు అయ్యింది. 2021-22 సంవత్సరంలో 4,600 కోట్ల లావాదేవీల జరిగాయి. వీటి విలువ 84.17 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.

200 లోపు చెల్లింపులే ఎక్కువ

నగదురహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ విధానాన్ని తీసుకు వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న యూపీఐ చెల్లింపుల్లో సగానికిపైగా 200 రూపాయల లోపుగానే ఉంటున్నాయి. పది రూపాయలు కూడా చాలా మంది ఈ విధానంలోనే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం వ్యక్తుల నుంచి వ్యక్తులకు, వ్యక్తుల నుంచి వ్యాపారులకు నగదు చెల్లించేందుకు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చెల్లింపులపై ఛార్జీలు , దానిపై జీఎస్‌టీ విధిస్తే ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు ఆర్బీఐ చర్చా పత్రాన్ని విడుదల చేసింది.

ఇప్పటి వరకు ఎలాంటి రుసుములు లేకుండానే ఇలాంటి చెల్లింపులు జరుగుతున్నాయి. ఇప్పుడు వీటిపై ఛార్జీలు విధిస్తే వినియోగదారులు మళ్లి నగదు చెల్లింపులకు మొగ్గు చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఛార్జీలు విధిస్తే యూపీఐ చెల్లింపులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. చర్చా పత్రం విషయంలో ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వస్తాయో, దానిపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement