నేటి యువతకు టెక్నాలజీలో నైపుణ్యం ఉందని, ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారని, భవిష్యత్‌లో అంతా డ్రోన్లు, టెక్నాలజీతోనే యుద్ధాలు జరుగుతాయని.. అందులో భాగంగానే తక్కువ వయస్సు వారిని ఆర్మీలోకి తీసుకుని దానికి తగ్గట్టు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు మిలటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి అనిల్పూరి. అగ్నిపథ్ స్కీమ్‌లో ఎన్నో మార్పులు చేశామని, ఇటీవలి హింస, దహన ఘటనల కారణంగా తమపై బలవంతమేమీ లేదని చెప్పుకొచ్చారు. ఇవ్వాల (ఆదివారం) అగ్నిపథ్ పథకంపై త్రిసేవా ఆఫీసర్లతో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ మీడియా మీట్లో ఇండియన్ ఆర్మీ అడ్జటెంట్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొనప్ప, ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ పర్సనల్, వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ ఇన్‌ఛార్జి ఎయిర్ మార్షల్ సూరజ్ ఝా కూడా పాల్గొన్నారు. అగ్నిపథ్ పథకం 1989లో ప్రణాళిక చేశారని.. దాన్ని అమలు చేయడానికి అవసరమైన చర్యలు కూడా అదే సమయంలో ప్రారంభమయ్యాయని పూరి చెప్పారు.
“మేము అనేక అంశాలను పరిగణించాలి. అనేక ఇతర మార్పులను మొదట అమలు చేయాలి. వయస్సు అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. సాయుధ దళాలలో చేరే వయస్సును ముందుగా తగ్గించాలి. కమాండింగ్ ఆఫీసర్ల వయసు కూడా తగ్గాలి’ అని అనిల్ పూరి అన్నారు. యంగ్ బ్లడ్, అనుభవజ్ఞులైనవారి మిశ్రమంగా ఉండాలని ఈ రిక్రూట్‌మెంట్ వయస్సును తగ్గించినట్టు ఆయన తెలిపారు.
సాయుధ దళాలకు యువ చైతన్యవంతులు, అనుభవజ్ఞులైన వ్యక్తుల కలయిక అవసరమని చెప్పారు. ఇక.. 2030 నాటికి దేశ జనాభాలో సగం మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉంటారు. అనుభవజ్ఞులైన సైనికులతో పాటు ఉత్సాహం, శక్తితో నిండిన యువకుల కలయికను మేము సృష్టించాలనుకుంటున్నాం అని అనిల్ పూరి చెప్పారు.
భవిష్యత్తులో జరిగే యుద్ధాలు సాంకేతికతపై ఆధారపడి ఉంటాయి. సాయుధ వాహనాలు, ట్యాంకులను ధ్వంసం చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తారు. ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో నిష్ణాతులైన టెక్ యువకులు కావాలి’’ అని అనిల్ పూరి అన్నారు. దేశంలోని ప్రతి యువకుడు స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించడంలో నిపుణుడని పేర్కొంటూ, 70% రిక్రూట్‌మెంట్‌లు గ్రామాలు, గ్రామీణ ప్రాంతాల నుండి ఉంటాయని సీనియర్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.
అగ్నిపథ్ పథకం కేవలం 40వేల ఖాళీలతో ఎందుకు ప్రారంభించబడిందో కూడా ఆయన వివరించారు. మేము ముందు దీన్ని చిన్నగా ప్రారంభించాలి అనుకుంటున్నాం.. ఇది ఎలా సాగుతుంది, ఇంకా ఏమి అవసరమో అంచనా వేయడానికి దాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నాం. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఈ రిక్రూట్‌మెంట్ కాస్త 50వేల నుంచి 60 వేల మంది దాకా చేరుతుంది. దీని తర్వాత 1.25 లక్షలకు పెరుగుతుంది.. అని అనిల్ పూరి తెలిపారు.