Tuesday, November 19, 2024

కొవిడ్ ప్ర‌భావంతో సిల‌బ‌స్ లో మార్పులు..

విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించి, నైపుణ్యాల చదువును అందించడమే లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ) కసరత్తు ప్రారంభించింది. రెండేళ్లుగా కోవిడ్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యారంగం కుదుపునకు లోనైన విషయం తెలిసిందే. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతోపాటు, కీలకమైన పరీక్షలనూ రద్దు చేసి పై తరగతుల్లోకి ప్రమోట్‌ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఒక తరగతిలోని సిలబస్‌ను పూర్తిగా అభ్యసనం చేయకుండా తర్వాతి తరగతుల్లోకి చేరాల్సి వచ్చింది. ఇదే విధంగా రెండేళ్లు జరగడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను సరళీకృతం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రాల ఎస్‌సీఈఆర్టీలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో నిపుణులు ఆయా తరగతుల విద్యార్థులకు అవసరమైన సిలబస్‌ను రూపొందించాల్సి ఉంటుంది. మార్చి నెలాఖరుకు పూర్తవ్వాలి కొత్త సిలబస్‌తో కూడిన పాఠ్య పుస్తకాలను వచ్చే ఏడాది మార్చిలోగా సిద్ధం చేయాలని ఎన్‌సీఈఆర్టీ సూచిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే వీటిని అందుబాటులోకి తేవడానికి ఇప్పటి నుంచే కసరత్తు చేయాల్సి ఉంది. కరోనా థర్డ్‌ వేవ్‌, ఒమిక్రాన్‌ హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంవత్సరంలో మార్పులు ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ముందస్తుగానే కొత్త కరిక్యులమ్‌తో కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే నేషనల్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌ వర్క్‌(ఎన్‌సీఎఫ్‌)తో సమ న్వయం చేసుకుంటూ నూతన కరిక్యులమ్‌ను తయారు చేసేలా రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అందుకోసం ఆయా సబ్జెక్టులు, బోధనారంగ నిపుణులతో చర్చలు జరిపి, కొత్త సిలబస్‌కు రూపకల్పన జరపాలి. అయితే పూర్తిస్థాయి మార్పులు కాకుండా అవసరమైన మేరకు సవరణలు చేయాలని రాష్ట్రంలో అధికారులు భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement