Thursday, November 21, 2024

విద్యుత్‌ ఛార్జీల్లో మార్పులు.. పగలు రాయితీ, రాత్రి బాదుడు

విద్యుత్‌ ఛార్జీల నియమనిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. టైమ్‌ ఆఫ్‌ డే, టారిఫ్‌ సిస్టమ్‌ పేరుతో తీసుకువస్తున్న ఈ కొత్త విధానంలో ఉదయం సమయాల్లో వినియోగించే విద్యుత్‌ ఛార్జీల భారం 20 శాతం తగ్గనుంది. విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉండే రాత్రివేళల్లో విద్యుత్‌ ఛార్జీలు సాధారణం కంటే 10 నుంచి 20 శాతం వరకు పెరుగుతాయని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. ఈ కొత్త నిబంధన 10 కిలోవాట్‌ అంతకంటే ఎక్కువ డిమాండ్‌ ఉన్న వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు ఏప్రిల్‌ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. వినియోగదారులు ఏ సమయంలో ఎంత విద్యుత్‌ ఉపయోగిస్తున్నారనేది స్మార్ట్‌ మీటర్ల ఆధారంగా గుర్తిస్తామని కేంద్ర విద్యుత్‌ శాఖ తెలిపింది.

డిమాండ్‌ తక్కువగా ఉన్న సమయంలో వినియోగదారులు ఎ క్కువ విద్యుత్‌ను వాడుకునేలా ప్రోత్సహించడం ద్వారా గ్రిడ్‌లపై భారం తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఉదయం వేళ సోలార్‌ పవర్‌ అందుబాటులో ఉన్నందున ధర తక్కువగా ఉంటుందని, అందుకే ఉదయం సోలార్‌ విద్యుత్‌ అవర్స్‌గా పేర్కొంది. అందుకే ఈ సమయాల్లో వినియోగించే విద్యుత్‌కు ఛార్జీలు తక్కువ చేసినట్లు తెలిపింది. రాత్రి సమయాల్లో జల, థర్మల్‌ విద్యుత్‌, బయోమాస్‌ విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది. ఈ ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రాత్రి సమయాల్లో వినియోగించే విద్యుత్‌కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ తెలిపింది. దీని వల్ల తమ విద్యుత్‌ అవసరాలను సోలార్‌ అవర్స్‌కు మార్చుకునే వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ఆర్‌కే సింగ్‌ చెప్పారు.

- Advertisement -

వాతావరణంలో జరుగుతున్న మార్పుల మూలంగా ఈ సంవత్సరం వేసవిలో అధిక ఉష్టోగ్రతలు నమోదు అయ్యాయి. దీనింతో దేశవ్యాప్తంగా విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. రానున్న 4 సంవత్సరాలల్లో విని యోగం రెట్టింపు అవుతుందని కేంద్రం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా మార్చి 2022 నాటికి డిమాండ్‌ నాలుగు శాతం ఉండగా, మార్చి 2027 నాటికి ఇది 7.2 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త విద్యుత్‌ ఛార్జీల టారీఫ్‌ను అమలు చేయడం ద్వారా గ్రిడ్‌లపై భారాన్ని తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది.

విద్యుత్‌ టారీఫ్‌లతో పాటు స్మార్ట్‌ మీటర్ల నిబంధనల్లోనూ మార్పులు చేసినట్లు విద్యుత్‌ శాఖ తెలిపింది. స్మార్ట్‌ మీటర్‌ బిగించిన తేదీకి ముందు వరకు వినియోగించిన విద్యుత్‌పై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని తెలిపింది. స్మార్ట్‌ మీటర్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. గతంలో స్మార్ట్‌ మీటర్‌ ఇన్‌స్టాల్‌ చేసిన తేదీ కంటే ముందు వరకు ఉపయమోగించిన విద్యుత్‌పై జరిమనా రూపంలో అదనపు ఛార్జీలు విధించేవారు. ఇకపై ఈ నిబంధన తొలగిస్తున్నట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ తెలిపింది. కొత్త టారీఫ్‌ విధానాన్ని తొలుత వాణిజ్య, ఇండస్ట్రీయల్‌ వినియోగదారులకే అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, తరువాత కాలంలో ఈ విధానాన్ని వ్యవసాయ రంగానికి మినహా అన్ని రకాల వినియోగదారులకు విస్తరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement