Saturday, November 23, 2024

క‌రొనా తెచ్చిన మార్పులు.. పాత ప‌ద్ధ‌తులే కొత్త ట్రెండ్..

మన జీవన విధానంపై కరోనా మహమ్మారి అనూహ్యమైన ప్రభావం చూపింది. మనిషి లేచింది మొదలు.. పడుకునే వరకు అన్ని వ్యవహారాలలోనూ మార్పు అనివార్యమైంది. తినే తిండి.. పీల్చే గాలి.. ఉండే ఇంటి విషయంలో కాస్తంత శుభ్రత.. భద్రత లేకపోతే క‌రొనా మ‌న‌ పనిపడుతుందేమోనన్న భయం.. మనిషిని మంచివైపు మళ్లిస్తోంది. హెటెక్‌ జీవితాల్లో బిజీ అయిపోయిన నవతరానికి వండే ఓపిక లేక.. సులువుగా, వేగంగా.. అప్పటి కప్పుడు తయారయ్యే, కొత్తగా ఉండే ఆహారంవైపు మళ్లిపోయి.. ఒళ్లు పెరిగిపోయిన నయా జమానా.. పాతకాలపు ఘుమఘుమలకు గులాములవుతోంది. ఇప్పటి శుచి, పోషకాలు లేని పదార్థాలు చేసే చేటును తెలుసుకుని అలనాటి ఆహారానికి ఓటేస్తున్నారు. రెండేళ్లుగా ఏ ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి. ప్లాస్మా టీవీలు.. ఇంటినిండా గాడ్జెట్లు.. హోం థియేటర్లు… ఇలా ఆధునిక శొబగులున్న ఇళ్లలో.. ఇప్పుడు అందమైన రాగి ఫ్లాస్కులు కన్పిస్తున్నాయి. విశాలమైన వంటిళ్లలో మట్టి కుండల్లో వింతైన శబ్దంతో కూరలు ఉడుకుతూ.. ఓ రకమైన వాసన గుబాళిస్తూంటే ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు. ఆ మధ్య వరకు మట్టి కుండలను చూసి… చిరాగ్గా కళ్లు చిట్లించే ఆధునిక జీవులు.. ఇప్పుడు బుద్ధిగా కుండల్లో వంటలకు అలవాటు పడుతున్నారు. మట్టిపాత్రల్లో వంటలు ఎలా చేసుకోవాలో సామాజిక మాధ్యమాల్లో తెగ వెతుకుతున్నారు. సన్నబియ్యం.. పాలిష్‌ బియ్యం పక్కకు జరిపి చిరుధాన్యాలు, దంపుడు బియ్యంతో ఆహార పదార్థాలు చేసుకుని తింటున్నారు.

రాగులు.. సజ్జలు.. జొన్నలు.. కొర్రలు.. ఇలా తృణ ధాన్యాలతో ఇడ్లీలు సహా ఉపాహారాలు చేసుకుంటున్నారు. కొత్త తరం ఆహారంలో రుచి తప్ప.. శక్తి లేదని కరోనా తేల్చేసింది. పాత తరం ఆహారంలో రుచితోపాటు రోగనిరోధక శక్తిని పెంచే శక్తి ఉందని గుర్తించిన సమాజం నామోషీని పక్కన పెట్టి… జై కొడుతోంది.

భవిష్యత్‌ సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంపై దృష్టి సారించి, మార్చుకోవాల్సిన విధానాలు ఇంకా చాలానే ఉన్నాయంటున్నారు వైద్యనిపు ణులు. పట్టణ ప్రాంతాల్లో జీవిస్తున్న వారిలో కొంతమంది జంక్‌ పుడ్‌తోపాటు శీతల పానీయాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో అనారోగ్య సమస్యలు ఉత్పన్న మవుతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఆరోగ్యం కోసం పరితపిస్తూ ఆహార విధానాలను మార్చుకోగా, ఇంకా మారాల్సింది చాలా ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement