హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశ భవిష్యత్తును మార్చే దిశగా రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర సాగుతుందని టీ పీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. అక్టోబర్24న రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ప్రవేశించి 13 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్ మణికొండలో ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ నివాసంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,సీఎల్పీనేత భట్టి విక్రమార్క, మహారాష్ట్ర సిఎల్పీనేత బాల సాహెబ్ తోరాట్, ఎమ్మెల్యేలు, ఏఐసిసి కార్యదర్శులు సోనాల్ పటేల్,ఆశిష్ భేటీ అయి తెలంగాణలో రాహుల్ గాంధీ నిర్వహించనున్న భారత్ జోడో పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందం ఇక్కడకు వచ్చిందని తెలిపారు. రాహుల్ పాదయాత్ర కర్నాటకలో 22 రోజులు, ఏపీలో4 రోజులు కొనసాగి, అక్టోబర్ 24న తెలంగాణలోకి ప్రవేశిస్తుందన్నారు. తెలంగాణలో యాత్ర ముగిసిన తరువాత మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందనీ, జోడో యాత్రపై ఒకరికొకరం సమన్వయం చేసుకోవాలని అనుకున్నామని వెల్లడించారు. తెలంగాణ,మహారాష్ట్ర నేతలతో కలసి సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసుకునే విషయాన్ని చర్చించామనీ, కర్నాటకలో కూడా మహారాష్ట్ర,తెలంగాణ నేతలు పర్యటించాలనే అంశంపై చర్చించామని వెల్లడించారు. చరిత్రలో ఒక కీలకమైన ఈ యాత్రలో పాల్గొనడం మాకు గొప్ప అవకాశమనీ,ఆనాడు గాంధీ చేపట్టిన దండి యాత్రలా భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలచిపోతుందని పేర్కొనారు.
తెలంగాణలో రూట్ మ్యాప్ వివరాలు తెలుసుకున్నాం : బాలా సాహెబ్ తోరాట్
భారత్ జోడో యాత్రకు విశేష ఆదరణ లభిస్తోందని మహారాష్ట్ర సిఎల్పీ నేత బాలా సాహెబ్ తోరాట్ అన్నారు. తెలంగాణలో రూట్ మ్యాప్ తయారీ వివరాలు తెలుసుకున్నామన్నారు. తెలంగాణలో మాదిరి గానే మహారాష్ట్రలో జోడో యాత్ర రూట్ మ్యాప్ తయారు చేస్తున్నామన్నారు. భారత్ జోడో యాత్రను విజయవంతం చేస్తామని తోరాట్ స్పష్టం చేశారు.