న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న జాతీయ గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ మార్చవలసినదిగా బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారులు, అభివృద్ధి శాఖా మంత్రి నితిన్ జయరామ్ గడ్కరీతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్‌ఫీల్డ్ హైవేకి సంబంధించి పలు అంశాలపై కూలంకషంగా చర్చించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజల ఆకాంక్షలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ఖమ్మం కలెక్టరేట్ సముదాయం వద్ద నిర్మితమవుతున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి అలైన్‌మెంట్‌ను మార్చాలని, ఈ రహదారిని ఖమ్మం నగరానికి 5 కిలో మీటర్లు దూరంలో నిర్మించాలని ఎంపీ నామా నితిన్ గడ్కరీని కోరారు.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అర్బన్ మండలం మల్లెమడుగు, బల్లేపల్లి, ఖమ్మం రూరల్ మండలం తీర్థాల, కామంచికల్లు, దారేడు, రేగులచలక,రఘునాథపాలెం, వి.వెంకటాయపాలెం మీదుగా నిర్మిస్తున్న ఈ జాతీయ రహదారి ఖమ్మం సమీకృత కలెక్టరేట్ దగ్గరగా వెళతుందని, దీనిని 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించడం వల్ల ఈర్లపూడి, మంగళగూడెం, కోటపాడు, తీర్థాల వంటి చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఖమ్మం నగరం ఎంతో అభివృద్ధిని సాధిస్తాయని కేంద్రమంత్రికి వివరించారు.గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్‌మెంట్‌ను మార్చి సమీకృత కలెక్టరేట్ నుంచి 5 కిలో మీటర్ల దూరం నుంచి నిర్మించడం వల్ల ఈనాడు కార్యాలయం – రఘనాథపాలెం రోడ్డును కూడా జాతీయ రహదారిగా మార్చడానికి అవకాశం ఉంటుందన్నారు.
అంతేకాకుండా కోదాడ – కురవి రహదారిని కూడా జాతీయ రహదారిగా మార్పు చేయడానికి సులువవుతుందని వివరించారు. అంతేకాకుండా భూసేకరణ వ్యయం కూడా బాగా తగ్గుతుందని నామ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నట్టు కేంద్రమంత్రికి వివరించారు. ఈ అంశాన్ని స్పెషల్ కేసుగా పరిగణించి గ్రీన్ ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ మార్పు చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు.
రెండు చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలి
ఖమ్మం – అశ్వారావుపేట జాతీయ గ్రీన్ ఫీల్డ్ (ఎన్‌హెచ్ 365 బీబీ) రహదారి అంతర్భాగంగా ఖమ్మం – దేవరపల్లి (ఎన్‌హెచ్ 365 బీజీ) రహదారిని 125 కిలో మీటర్ల మేర జాతీయ గ్రీన్ ఫీల్డ్ రహదారిగా నిర్మిస్తున్నారని నామా కేంద్రమంత్రికి తెలిపారు. ఇది హైదరాబాద్ – విజయవాడ, జగిత్యాల – కరీంనగర్ – వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారులను కలుపుతుందని తెలిపారు. అంతేకాకుండా కాకినాడ పోర్టు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక కారిడార్లకు కూడా ప్రధాన అనుసంధాన రహదారిగా కూడా ఉంటుందని నామ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న సత్తుపల్లి పట్టణం బొగ్గు, ఇతర పరిశ్రమలతో వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వేంసూరు, సత్తుపల్లి పట్టణాలు, మండలాలు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వైద్యం, ఇతర అవసరాల కోసం విజయవాడ – రాజమండ్రి, హైదరాబాద్ నగరాలకు వెళ్లే క్రమంలో గ్రీన్ ఫీల్డ్ రహదారిని చేరుకోవడానికి 30 నుంచి 40 కిలో మీటర్ల దూరం అవుతోందన్నారు.
ఇది ప్రజలకు భారం కావడంతో పాటు పర్యవరణ సమస్యలు కూడా ఏర్పడతాయని, అనవసరమైన ఇంధన వృథా అవుతున్నందున కల్లూరు మండలంలోని లింగాల గ్రామం వద్ద, వేంసూరు మండలంలో రెండు ఎంట్రీ, ఎగ్జిస్ట్ ప్రొవిజన్ ను ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని నామా కోరారు. ప్రజా ప్రతినిధులు, రైతులు, ప్రజలు, భూనిర్వాసితుల అభ్యర్థన మేరకు ఎంట్రీ, ఎగ్జిట్స్ ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయాలి
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా నిర్మితమవుతున్న ఖమ్మం – అశ్వరావుపేట గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి 60 కిలో మీటర్ల మేర తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి మీదుగా నిర్మితమవుతోందని నామా గడ్కరీకి తెలిపారు. ఇది హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, తదితర జిల్లాలను కలపడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నార్తన్ కోస్టల్ డిస్ట్రిక్ట్‌లను కూడా కలుపుతుందన్నారు. అంతేకాకుండా వైజాగ్, కాకినాడలను అనుసంధానిస్తుందన్నారు. గ్రానైట్, బొగ్గు, మిషనరీ వాహనాల రాకపోకల వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుందని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పినపాక, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, లంకపల్లి,సత్తుపల్లి అలైన్మెంట్లో ఎలాంటి పురోగతి పనులు చేయకపోవడం వల్ల గ్రీన్ ఫీల్డ్ రహదారిలో కూడా అదే ట్రాఫిక్ సమస్య అధికంగానే ఉంటుందన్నారు. సింగరేణి ఉపరితల బొగ్గు గనులు, వ్యవసాయం, వేగవంతమైన పట్టణీకరణ వల్ల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పుకొచ్చారు. భూసేకరణ తదితర సమస్యలు వల్ల 4 నుంచి 6 ఏళ్ల సమయం పడుతుందన్నారు.
అందు వల్ల పట్టణాల పరిధిలో రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఉందని నామా చెప్పారు. కల్లూరు పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని, అంతేకాకుండా నాలుగు లైన్ల రహదారిగా ఉండడం వల్ల స్ట్రెచ్ విస్తరణ, కాలువల నిర్మాణాన్ని మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం అన్ని చోట్లా కలిపి సుమారు రూ.266 కోట్ల వరకూ అవసరం ఉంటుందని నామా నాగేశ్వరరావు కేంద్ మంత్రికి వివరించారు. అలాగే పినపాక, తల్లాడ పట్టణాల్లో వాణిజ్యపరంగానే కాకుండా మామిడి వంటి వాణిజ్య పంటల ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉ న్నందున ఆ పట్టణాల్లో కూడా రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం రూ. 40 కోట్లు అవసరం ఉంటుందని తెలిపారు. పెనుబల్లి నుంచి లంకపల్లిలో బొగ్గు, మామిడి, ఇతర వాణిజ్య ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉన్నందున అక్కడ కూడా రోడ్లను విస్తరించాలని కేంద్రమంత్రిని కోరారు.
ఇందుకోసం రూ.65 కోట్లు అవసరం ఉంటుందని తెలిపారు. అలాగే సత్తుపల్లి పట్టణ పరిధిలో రోడ్ల విస్తరణకు రూ. 40 కోట్లు దాకా అవసరం పడుతుందని వివరించారు. అలాగే బేతుపల్లి, గంగారంలో రోడ్ల విస్తరణకు, డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి రూ. 66 కోట్లు దాకా అవసరం ఉంటుందని నామా చెప్పారు. ఆయా పట్టణాల్లో రోడ్లు విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చని తెలిపారు. దృష్టికి తీసుకొచ్చిన అన్ని రకాల నమస్యలను సత్వరమే పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమన్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రిని కోరారు.