Tuesday, November 26, 2024

Delhi | కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కో-ఇన్‌చార్జిల మార్పు.. మన్సూర్ అలీ ఖాన్, విష్ణునాథ్‌కు బాధ్యతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతల్లో ఏఐసీసీ మార్పులు చేర్పులు చేసింది. రాష్ట్ర వ్యవహారాల కో-ఇంచార్జి ఎన్ఎస్ బోసు రాజును కొత్తగా ఏర్పడ్డ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా తీసుకున్నందున ఆయన్ను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించారు. అలాగే నదీమ్ జావేద్‌కు వేరే బాధ్యతలు అప్పగించేందుకు ఏఐసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ కో-ఇంచార్జిలుగా కొత్తవారిని నియమిస్తూ ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరిట ప్రకటన విడుదలైంది.

బోసురాజు, నదీమ్ జావేద్ ల స్థానంలో ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీ ఖాన్, పీసీ విష్ణునాథ్‌లను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఇద్దరూ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రేకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. వీరిలో పీసీ విష్ణునాథ్ ఇప్పటి వరకు కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల కో-ఇంచార్జిగా ఉన్నారు. అక్కడ పార్టీ విజయంలో భాగస్వామిగా ఉన్న విష్ణునాథ్ సేవలను త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న తెలంగాణలో వినియోగించుకోవాలని ఏఐసీసీ భావించింది. ఆ మేరకు ఈ మార్పులు చేర్పులు చేసినట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement