న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఇష్టారీతిగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు అనుమతి ఇచ్చి ఆఖరి నిమిషంలో రద్దు చేసిన పోలీసులు ఆయన కాన్వాయ్ వెళ్లకుండా వాహనాలు అడ్డుపెట్టారని రఘురామ ఆరోపించారు.
జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబును చీకట్లో ఏడు కిలోమీటర్లు నడిచేలా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాబు భద్రతపై కేంద్ర అధికారులతో నివేదిక తెప్పించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తోందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కార్యాలయం ఎలాంటి ప్రజాస్వామిక సూత్రాలను పాటించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల అణిచివేత చర్యలతో ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నం చేస్తున్నారని ఆయన వాపోయారు.